Visakhapatnam: యోగాంద్ర వేడుకలకు ముస్తాబవుతున్న విశాఖ

యోగాంద్ర వేడుకలకు ముస్తాబవుతున్న విశాఖ

Visakhapatnam : ఈ నెల 21న విశాఖ వేదికగా జరగనున్న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని విశాఖ నగరాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ, విశాఖ జిల్లా ఇన్ ఛార్జ్ మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయస్వామి తెలిపారు. బుధవారం నాడు విశాఖ దసపల్లా హోటల్ లో మంత్రులు అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దన్ రెడ్డి, VMRDA చైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్ తో కలసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రి బాల వీరాంజ నేయస్వామి మాట్లాడుతూ… యోగా మన సాంప్రదాయానికి ప్రతిరూపం మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరి ఆరోగ్య జీవనశైలిలో భాగం. ప్రధాని నరేంద్ర మోదీ భావనలతో ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఇప్పటివరకు 10 యోగా దినోత్సవాలు ఘనంగా నిర్వహించాం, 11వ యోగా దినోత్సవాన్ని (Yoga Day) విశాఖ నగరంలో జరపడం రాష్ట్రానికి గర్వకారణం.

Visakhapatnam Yoga Day Preperations

ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హాజరుకానుండగా, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా యోగాసనాల్లో పాల్గొననున్నారు. ప్రపంచవ్యాప్తంగా 175 దేశాల ప్రతినిధులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. విశాఖ (Visakhapatnam) బీచ్‌ లో కాళీ మాత ఆలయం నుంచి బీచ్ వరకు యోగా ప్రదర్శన ఉంటుంది. ఇక్కడ 3 లక్షల 26 వేల మందితో యోగా చేయించడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే మొత్తం 5 లక్షల మంది పాల్గొననున్న యోగా కార్యక్రమం ద్వారా విశాఖ నగరంలో గిన్నిస్ బుక్ రికార్డు నెలకొల్పేలా ఏర్పాట్లు చేస్తున్నాం. రాష్ట్రవ్యాప్తంగా 2 కోట్ల మందిని ఈ యోగా ప్రదర్శనలో భాగం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

ఈ కార్యక్రమంలో 25 వేల మంది విద్యార్థులు 108 సూర్య నమస్కారాలు చేస్తారు. వీటన్నింటికీ విశాఖ (Visakhapatnam) వేదికగా మారనుంది. ఇది రాష్ట్రానికి దక్కిన అపూర్వ గౌరవం, అందరూ దీనిలో భాగం కావాలి. 14 సంవత్సరాలు పైబడినవారంతా కార్యక్రమంలో పాల్గొననుండగా, దూరప్రాంతాల నుంచి వచ్చే వారికోసం రవాణా, భోజన వసతి, బస, మరుగుదొడ్ల ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశాం. ఇప్పటికే కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశాం. ఎవరికీ ఇబ్బంది కలగకుండా నిర్ధిష్ట సమయానికి అంటే తెల్లవారుజామున 5 గంటలకే కార్యక్రమ ప్రాంగణాలకు చేరేలా చర్యలు తీసుకున్నాం. ఈ కార్యక్రమ విజయవంతానికి వాలంటీర్లు, సిబ్బంది కట్టుబడి ఉండాలి’’ అని తెలిపారు. “యోగా అనేది జీవితంలో ఒక భాగంగా మారాలని, అందరు ప్రజలు దీన్ని ఆచరించాల్సిన అవసరం ఉంది. ఈ కార్యక్రమం ద్వారా ఆ సందేశాన్ని ప్రపంచానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే విశాఖ వేదికగా ఎంపిక చేశాం,” అని మంత్రి బాలవీరాంజనేయస్వామి స్పష్టంచేశారు.

యోగా వేడుకలో పాల్గొనే ప్రజలకు రవాణా సదుపాయంపై మంత్రుల సమీక్ష

ఈ నెల 21న విశాఖ వేదికగా జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవ (Yoga Day) వేడుకలకు హాజరయ్యే ప్రజలకు కల్పించే రవాణా సదుపాయంపై మంత్రులు సమీక్షించారు. బుధవారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్ మీటింగు హాలులో రాష్ట్ర మంత్రులు పి. నారాయణ, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ, ఎమ్మెల్యేలు, ఉన్నత అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ప్రజలు సులభంగా ఆయా వేదికల వద్దకు చేరుకునేలా తగిన ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. వాహనాల కేటాయింపు, తరలింపు, పార్కింగ్ తదితర విషయాల్లో అనుసరిస్తున్న విధానాలపై అడిగి తెలుసుకున్నారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందీ రాకుండా పక్కా చర్యలు చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో స్పెషల్ సీఎస్ కృష్ణబాబు, జిల్లా కలెక్టర్ ఎం. ఎన్. హరేంధిర ప్రసాద్, రాష్ట్ర స్థాయి ఐఎస్ఐ అధికారులు, ఎంపీ శ్రీ భరత్, స్థానిక ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు.

కమాండ్ కంట్రోన్ రూం ను పరిశీలించిన హోం మంత్రి అనిత

అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల ఏర్పాట్లలో భాగంగా ఏయూలోని యోగాంధ్ర కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. యోగా దినోత్సవ వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన పార్కింగ్ ప్లేసులు, ట్రాఫిక్ డైవర్షన్స్ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈ యోగా డేకు భారీఎత్తున ప్రజలు తరలిరానున్నందున ట్రాఫిక్ పరంగా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ క్రమబద్దీకరణ, నియంత్రణ మరియు పర్యవేక్షణకు సీసీ టీవీలు, నిఘా కోసం డ్రోన్లు ఉపయోగించాలని ఆదేశించారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, ట్రాఫిక్ మళ్లింపు వంటి అంశాలపై దృష్టి సారించి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను హోం మంత్రి ఆదేశించారు.

Also Read : YS Jagan: రెంటపాళ్ళలో వైఎస్‌ జగన్‌ పర్యటన ! నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ !

Leave A Reply

Your Email Id will not be published!