YS Jagan: రెంటపాళ్ళలో వైఎస్‌ జగన్‌ పర్యటన ! నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ !

రెంటపాళ్ళలో వైఎస్‌ జగన్‌ పర్యటన ! నాగమల్లేశ్వరరావు కుటుంబానికి పరామర్శ !

YS Jagan : వైఎస్‌ఆర్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి (YS Jagan) సత్తెనపల్లి నియోజకవర్గంలోని రెంటపాళ్లలో పర్యటించారు. రెంటపాళ్లలో కూటమి నేతలు, పోలీసుల వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్న రెంటపాళ్ల ఉపసర్పంచ్‌ కొర్లకుంట నాగమల్లేశ్వరరావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం, నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించారు. అయితే, వైఎస్‌ జగన్‌ రెంటపాళ్ల పర్యటనకు కూటమి ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులను జారీ చేసింది. కేవలం వంద మందికి మాత్రమే గ్రామంలోనికి అనుమతి ఇస్తూ ఎక్కడికక్కడ బారీ కేడ్లు, చెక్‌ పోస్టులను ఏర్పాటు చేసింది. అయితే భారీ కేడ్లు, చెక్‌ పోస్టులను త్రోసుకుంటూ వైసీపీ కార్యకర్తలు, అభిమానులు వైఎస్ జగన్‌ వెంట పరుగులు తీసారు.

YS Jagan Visit

ఈ సందర్భంగా వైఎస్ జగన్న (YS Jagan) మీడియాతో మాట్లాడుతూ… ‘ఏపీలో అభివృద్ధి, సంక్షేమం ఏదీ లేదు. కేవలం రెడ్‌బుక్‌ రాజ్యాంగం​ మాత్రమే నడుస్తోంది. దారుణమైన పరిస్థితులు ఉన్నాయి అనడానికి ఆంక్షలే నిదర్శనం. తమకు అనుకూలమైన పోలీసులను ఎన్నికల ఫలితాల వేళ నియమించుకున్నారు. కూటమిని గెలిపించుకునేందుకు అన్యాయాలు చేశారు. ఈ విషయం ఈ ప్రాంతం వారందరికీ తెలుసు. నాగమల్లేశ్వరరావు రెంటపాళ్ల ఉపసర్పంచ్‌. అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్‌ రోజున టీడీపీ, జనసేన నేతల తప్పుడు ఆరోపణలతో నాగమల్లేశ్వరరావును పీఎస్‌కు తీసుకెళ్లారు. అక్కడ ఘోరంగా అవమానించారు. టీడీపీకి అనుకూల ఫలితలు రావడంతో నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేశారు. ఊరు విడిచిపోవాలని ఆయన్ని వేధించారు. లేకుంటే రౌడీ షీట్‌ తెరుస్తామని సీఐ ఏకంగా బెదిరించారు.

జూన్‌ ఐదో తేదీ రాత్రి పోలీసులు నాగమల్లేశ్వరరావును విడిచిపెట్టారు. ఆయన సరాసరి గుంటూరులోని తన సోదరుడి ఇంటికి వెళ్లారు. అక్కడి నుంచి తన తండ్రికి ఫోన్‌ చేసి పోలీసులు బెదిరించిన తీరును నాగమల్లేశ్వరరావు వివరించారు. పోలీసుల తీరుతోనే నాగమల్లేశ్వరావు ఆత్మహత్యయత్నం చేశారు. తనకొడుకును కాపాడుకునేందుకు వెంకటేశ్వర్లు తీవ్రంగా యత్నించారు. అయినా ఫలితం లేకుండా పోయింది.

నాగమల్లేశ్వరరావు ఇంటిపై దాడి చేసిన వాళ్లపై చర్యలు తీసుకోలేదు. వెంకటేశ్వరరావు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. నాగమల్లేశ్వరరావును బెదిరించిన ఆ సీఐపై చంద్రబాబు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?. నాగమల్లేశ్వరరావుకు భార్యా, కూతురు ఉన్నారు. చంద్రబాబు ఏం సమాధానం చెబుతారు?. ఏడాది గడిచినా ఆ కుటుంబం ఇంకా శోకంలోనే ఉంది అని జగన్‌ ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే నియోజక వర్గంలో లక్ష్మీనారాయణ అనే పార్టీ కార్యకర్తపైనా పోలీసులు వేధింపులకు పాల్పడ్డారని, అది భరించలేక ఆయన పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించి చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడని జగన్‌ ప్రస్తావించారు.

జగన్ పర్యటలో అపశృతి ! ఇద్దరు వైసీపీ అభిమానులు మృతి !

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ (YS Jagan) గుంటూరు జిల్లా పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. బుధవారం ఉదయం ఏటూకురులో వైఎస్ జగన్ ప్రయాణిస్తున్న కాన్వాయ్ లోని ఒక వాహనం… ఒక వృద్ధుడిని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆయన తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందాడు. మరోవైపు ఈ కార్యక్రమానికి హాజరైన వైసీపీ కార్యకర్త… వడదెబ్బ కారణంగా సొమ్మసిల్లి పడిపోయాడు. అతడ్ని హుటాహుటీన ఆసుపత్రికి తరలించిప్పటికీ… అప్పటికే ఆయన మృతి చెందాడు.

Also Read : YS Sharmila: ఫోన్ ట్యాపింగ్ జరిగింది అనేది పచ్చి నిజం – వైఎస్ షర్మిల

Leave A Reply

Your Email Id will not be published!