Viswanatha Satyanarayana: “కవి సమ్రాట్” తొలి తెలుగు జ్ఞానపీఠ అవార్డు గ్రహీత

"కవి సమ్రాట్" బిరుదాంకితుడు మరియు జ్ఞానపీఠ అవార్డును అందుకున్న తొలి తెలుగు సాహితీ వేత్త.

విశ్వనాథ సత్యనారాయణ

Viswanatha Satyanarayana : విశ్వనాథ సత్యనారాయణ (సెప్టెంబరు 10, 1895 – అక్టోబరు 18, 1976): కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం నందమూరు లో జన్మించిన విశ్వనాథ సత్యనారాయణ(Viswanatha Satyanarayana) 20వ శతాబ్దపు తెలుగు రచయిత. “కవి సమ్రాట్” బిరుదాంకితుడు మరియు జ్ఞానపీఠ అవార్డును అందుకున్న తొలి తెలుగు సాహితీ వేత్త. అతని రచనలలో కావ్యాలు, కవితలు, నవలలు, నాటకలు, పద్యకావ్యాలు, ప్రయోగాలు, విమర్శలు, వ్యాసాలు, కథలు, చరిత్రలు ఉన్నాయి.

Viswanatha Satyanarayana – సహాయనిరాకరణోద్యమంలో విశ్వనాథ

విశ్వనాథ సత్యనారాయణ బాల్యం దశ బాగానే ఉన్నప్పటికీ తండ్రి శోభనాద్రి చేసిన దానధర్మాల వలన తరువాత కడుపేదరికం అనుభవించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రాథమిక విద్యను నందమూరు, ఇందుపల్లి, పెదపాడు గ్రామాల్లో పూర్తి చేసిన విశ్వనాథ పై చదువు బందరు హైస్కూలులో చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి వద్ద పూర్తి చేసారు. చెళ్లపిళ్ల వెంకట శాస్త్రి… తిరుపతి వెంకట కవులు ద్వయంలో ఒకరు. విశ్వనాథ సత్యనారాయణ కళాశాలలో చదువుతూండగా 1921లో మహాత్మాగాంధీ పిలుపుమేరకు సహాయ నిరాకరణోద్యమంలో పాల్గొన్నారు. తండ్రి చనిపోయి కుటుంబం దుస్థితిని అనుభవిస్తున్నా అతను మాత్రం వెనక్కి తగ్గలేదు. ఆ తరువాత బందరులోని ఆంధ్ర జాతీయ కళాశాల, హిందూ కళాశాలలో అధ్యాపకునిగా చేసారు.

విశ్వనాథ రచనా ప్రస్థానం

1916 లో “విశ్వేశ్వర శతకము”తో విశ్వనాథ(Viswanatha Satyanarayana) రచనా ప్రస్థానము ప్రారంభించిన విశ్వనాథ… అప్పటి జాతీయోద్యమ ప్రభావంతో “ఆంధ్రపౌరుషము” రచించి1920 నాటికే తెలుగులో ప్రసిద్ధ కవిగా గుర్తింపు తెచ్చుకొన్నాడు. ఆధునిక, శాస్త్రీయ శైలిలో, సంక్లిష్ట రీతుల్లో రాసిన ఆయన ప్రసిద్ధ రచనలలో శ్రీమద్రామాయణ కల్పవృక్షం (రామాయణం కోరికలు తీర్చే దివ్య వృక్షం), కిన్నెరసాని పాటలు (మత్స్యకన్య పాటలు), నవల వేయిపడగలు (ది థౌజండ్ హుడ్స్) ముఖ్యమైనవి.
తెలుగుభాషకు విశ్వనాథ వందల్లో రచనలందించాడు. అతను రచనలను కొన్ని ఇతర భాషలలోకి అనువదించారు. రేడియో కోసం నాటకాలు, ప్రసంగాలు రూపొందించారు. 1961లో కరీంనగర్ ప్రభుత్వ కళాశాలలో ప్రిన్సిపాలుగా పదవీ విరమణ చేసిన తరువాత పూర్తి స్థాయిలో తన సమయాన్ని సాహితీ వ్యాసాంగానికి కేటాయించారు. తెలుగు తనమన్నా, తెలుగు భాష అన్నా విశ్వనాథకు ప్రత్యేక అభిమానం. విశ్వనాథ రచనలలో అతని పాండిత్యమే కాక, రచనాశిల్పం, పాత్ర చిత్రణ, చారిత్రక అవగాహన అద్భుతంగా కనిపిస్తుంటాయి. విశ్వనాథ రచించిన ‘వేయిపడగలు’ నవలను మాజీ ప్రధాన మంత్రి పి.వి.నరసింహారావు “సహస్రఫణ్” పేరుతో హిందీ లోకి అనువదించారు.

విశ్వనాథుని పురస్కారాలు

విశ్వనాథ సత్యనారాయణ రచించిన శ్రీమద్రామాయణ కల్పవృక్షం (రామాయణం కోరికలు తీర్చే దివ్య వృక్షం) కు భారతదేశ అత్యున్నత సాహితీ పురస్కారం జ్ఞానపీఠ పురస్కారం వరించింది. జ్ఞానపీఠ పురస్కారం అందుకున్న తొలి తెలుగ సాహితీ వేత్తగా విశ్వనాధ సత్యనారాయణ చరిత్రకెక్కారు. ఆంధ్రజాతి తన సంప్రదాయాలకు అనుగుణంగా అతనును “కవి సమ్రాట్” బిరుదుతో సత్కరించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన్ను ఆస్థాన కవిగా గౌరవించగా భారత ప్రభుత్వము పద్మభూషణ పురస్కారంతో గౌరవించింది. “విశ్వనాథ మధ్యాక్కఱలు” రచనకు కేంద్రసాహిత్య అకాడెమీ బహుమతి లభించింది. తెలుగ సాహిత్యానికి విశ్వనాథ సత్యనారాయణ చేసిన సేవలకు గాను తన బొమ్మ ఉన్న తపాలా బిళ్ళను 26-04- 2017 న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది.

Also Read : Ravuri Bharadhwaja: “జ్ఞానపీఠ అవార్డు” గ్రహీత

Leave A Reply

Your Email Id will not be published!