Ravuri Bharadhwaja: “జ్ఞానపీఠ అవార్డు” గ్రహీత

ప్రముఖ తెలుగు రచయిత, "జ్ఞానపీఠ అవార్డు” గ్రహీత

రావూరి భరద్వాజ

Ravuri Bharadhwaja : రావూరి భరద్వాజ (జూలై 5, 1927-అక్టోబరు 18, 2013): తెలుగు రచనా ప్రపంచంలో వినూత్న సాహితీ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన ఘనుడు రావూరి భరద్వాజ. కృష్ణా జిల్లా కంచికచర్ల సమీపంలోని మోగులూరులో జన్మించిన రావూరి భరద్వాజ… భారత దేశపు అత్యున్నత సాహితీ పురస్కారం “జ్ఞానపీఠ అవార్డు” అందుకున్న మూడవ తెలుగు సాహిత్య దిగ్గజం. కేవలం 8వ తరగతి వరకే చదువుకున్నరావూరి భరద్వాజపై చలం ప్రభావం ఎక్కువగా ఉండేది. యుక్త వయసులోనే తెనాలి చేరిన రావూరి భరద్వాజ అక్కడ ఒక ప్రెస్సులో పనిచేయటం ప్రారంభించాడు.

ఆ తరువాత జమీన్‌ రైతు వారపత్రిక, దీనబంధు, జ్యోతి, సమీక్ష, అభిసారిక, చిత్రసీమ, సినిమా, యువ వంటి పత్రికల్లో పనిచేసారు. ఆ తరువాత కొన్నాళ్ళు ఫౌంటెన్ పెన్నుల కంపెనీలో సేల్స్‌మన్‌గా పనిచేసి అక్కడ యజమాని అమానుషత్వాన్ని భరించలేక రాజీనామా చేసి బయటకు వచ్చారు. కొన్ని రోజుల పాటు ఖాళీగా ఉన్న రావూరి హైదరాబాదు ఆకాశవాణి కేంద్రంలో 1959లో ప్రూఫ్ రీడింగ్ కళాకారునిగా చేరి చివరకు 1987లో ప్రసంగ కార్యక్రమాల ప్రయోక్తగా పదవీ విరమణ చేశాడు.

Ravuri Bharadhwaja – రచయితగా రావూరి ప్రస్థానం

1950లొ ముద్రించబడిన రాగిణి అనే పుస్తకం భరద్వాజ(Ravuri Bharadhwaja) గారి ప్రధమ రచన. పాకుడురాళ్ళు, జీవన సమరం, కాదంబరి వంటి రచనలు ఆయనకు ఎనలేని కీర్తి ప్రతిష్టలను తెచ్చి పెట్టాయి. చలనచిత్ర పరిశ్రమ కధా వస్తువుగా ఆయన కలం నుండి జాలువారిన పాకుడురాళ్ళు నవల విమర్శకుల ప్రశంసలతో బాటు జ్ఞానపీఠ అవార్డును కూడా తెచ్చి పెట్టింది. ఈ నవలలో రావూరి… వెండి తెర వెలుగుల వెనుక ఉన్న చీకటి కోణాలను స్పృశించిన శైలి, వర్ణించిన విధానం ఒక గొప్ప సంచలనం, మరియు ఆలోచనాత్మకం. రావూరి భరద్వాజ(Ravuri Bharadhwaja) తన జీవన గమనంలో సుమారు 187 పైగా పుస్తకాలను వెలువరించారు, 500 పైగా కథలను 37 కథా సంపుటాలుగా, 17 నవలలు, 6 బాలల మినీ నవలలు, 5 బాలల కథా సంపుటాలు, 3 వ్యాస, ఆత్మకథా సంపుటాలు, 8 నాటికలు, ఐదు రేడియో కథానికలు రచించాడు.

రావూరిని వరించిన పురస్కారాలు

రావూరి భరద్వాజకు 1980లో ఆంధ్ర విశ్వవిద్యాలయం, 1987లో జవర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం, 1991లో నాగార్జున విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్లు ప్రదానం చేసి గౌరవించాయి. కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు, సోవియట్ భూమి నెహ్రూ అవార్డు, రాజాలక్ష్మీ ఫౌండేషన్ అవార్డు, తెలుగు కళాసమితి కె.వి.రావు, జ్యోతిరావు అవార్డు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కళారత్న అవార్డు, లోక్ నాయక్ ఫౌండేషన్ పురస్కారం, 2011 లో మరోసారి కేంద్ర సాహిత్య అకాడమీ, వంగూరి ఫౌండేషన్, గోపీచంద్ జాతీయ సాహిత్య పురస్కారాలు అందుకున్నారు. తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన బహుముఖ కృషికి గుర్తుగా 2012 వ సంవత్సరంలో జ్ఞానపీఠ పురస్కారం (పాకుడురాళ్ళు నవలకు ఈ గౌరవం దక్కింది) ఆయనను వరించింది.

Also Read : Katyayani Vidmahe: అభ్యుదయ రచయిత్రి కాత్యాయనీ విద్మహే

Leave A Reply

Your Email Id will not be published!