Katyayani Vidmahe: అభ్యుదయ రచయిత్రి కాత్యాయనీ విద్మహే

అభ్యుదయ రచయిత్రి కేతవరపు కాత్యాయనీ విద్మహే.

కాత్యాయని విద్మహే

Katyayani Vidmahe : కాత్యాయని విద్మహే: అభ్యుదయ రచయిత్రి కేతవరపు కాత్యాయనీ విద్మహే 1955 నవంబర్ 3 న ప్రకాశం జిల్లా మైలవరం (అద్దంకి)లో జన్మించారు. కాత్యాయనీ పుట్టింది మైలవరంలోనైనా… పెరిగింది, విద్యాభ్యాసం అంతా వరంగల్‌లోనే. అంతేకాదు కాకతీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్ డి డిగ్రీ పొందిన అక్కడే తెలుగు ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు.

 

Katyayani Vidmahe – కాత్యాయనీ విద్మహే రచనా ప్రస్థానం

కాత్యాయనీ విద్మహే అన్న కలం పేరుతో 1977నుంచి పరిశోధనలు మొదలుపెట్టి… 1982 నుంచి మహిళా జనజీవన దృక్పథంతో సాహిత్య విమర్శనా వ్యాసాలు రాశారు. అలంకార శాస్త్రం, సాహిత్య విమర్శ, నిరంతర చింతనా విషయాలు, మార్క్సిజం, స్త్రీవాద దృక్పథం, సామాజిక సిద్ధాంతాలు తదితర అంశాలపై సుమారు 285 వ్యాసాలు రాశారు. 275 పరిశోధన పత్రాలు సమర్పించారు. కాత్యాయని(Katyayani Vidmahe) ఇప్పటి వరకూ 20 పుస్తకాలు రాశారు. వాటిల్లో సాహిత్యాకాశంలో సగం, స్త్రీల కవిత్వం, కథ, అస్తిత్వ చైతన్యం, తదితర పుస్తకాలు అవార్డు పొందడానికి కారణమయ్యాయి. లింగ వివక్షను వ్యతిరేకిస్తూ మహిళా సాధికారత – సవాల్, ఆధునిక తెలుగు సాహిత్యం – స్త్రీల భూమిక, లింగ సమానత్వం దిశగా సమాజ సాహిత్యం, కన్యాశుల్కం – సామాజిక సంబంధాలు, జెండర్ స్పృహ తదితర పుస్తకాలు ఆమె రాశారు.

 

తండ్రి సాహిత్య వ్యాసాలను వెలుగులోనికి తీసుకువచ్చిన కాత్యాయనీ విద్మహే

 

తన తండ్రి రామకోటిశాస్త్రి రాసిన సాహిత్య వ్యాసాలను 22వరకు పుస్తకాలుగా ప్రచురింపచేశారు. 1992నుంచి ఇప్పటివరకు ప్రతి ఏడాది అక్టోబరు 28న తనతండ్రి వర్థంతిరోజు తప్పనిసరిగా ఒక పుస్తకాన్ని విడుదల చేస్తున్నారు. తెలంగాణ సాహిత్యానికి సంబంధించి కాళోజీ, అల్లం రాజయ్య, పాల్కంపెల్లి శాంతాదేవి రచనలపై ఎంఫిల్ స్థాయి పరిశోధనలు, తెలంగాణ పోరాట నాటకంపై పీహెచ్‌డీ స్థాయి పరిశోధనలు కూడా చేయించారు. విప్లవ పోరాటాల ప్రభావంతో గళమెత్తిన స్త్రీల గురించి, సంప్రదాయాలను, కట్టుబాట్లను, మూఢవిశ్వాసాలను ప్రశ్నిస్తూ వివిధ రచయిత్రుల రచనలను పరిచయం చేశారు.

 

కాత్యాయనీ విద్మహేను వరించిన పురస్కారాలు

 

‘సాహిత్యాకాశంలో సగం-స్త్రీల అస్తిత్వ సాహిత్యం కవిత్వం, కథ’ అనే కథా కవిత్వం విమర్శనా గ్రంథానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి ఎంపికయ్యారు.ఈ పుస్తకాన్ని తొలి మహిళా ఉద్యమ రచయిత్రి బండారు అచ్చమాంబ, తొలి అభ్యుదయ సాహిత్యోద్యమ రచయిత్రి వట్టికొండ విశాలాక్షి, విప్లవోద్యమ కార్యచరణలో భాగమైన రంగవల్లికి అంకితం చేశారు. పులికంటి కృష్ణారెడ్డి అవార్డు, రంగవల్లి స్మారక పురస్కార తదితర అవార్డులు అందుకున్నారు. ప్రస్తుతం ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక రాష్ర్ట కార్యదర్శిగా, మానవహక్కుల వేదిక సభ్యురాలిగా ఉన్నారు.

Also Read : Chaganti Somayajulu: చాసోగా సుపరితం అయిన ప్రముఖ రచయిత

Leave A Reply

Your Email Id will not be published!