గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తాం : లోకేష్

ధార్మిక కార్యక్రమాల నిర్వహణకు ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం

అమరావతి : గత ప్రభుత్వంలో పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తామ‌ని హామీ ఇచ్చారు మంత్రి నారా లోకేష్. విశ్వ హిందూ పరిషత్ భాగ్యనగర్ క్షేత్ర కార్యదర్శి తనికెళ్ళ సత్య రవికుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్త ఆర్ఎస్ఎస్ కార్యకర్త దొరస్వామి, ఆంధ్రప్రదేశ్ విశ్వ హిందూ పరిషత్ కోశాధ్యక్షులు వలిపర్తి దుర్గా ప్రసాద్ రాజు, ఆంధ్రప్రదేశ్ గణేష్ ఉత్సవ సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాకాల త్రినాథ్, ఉండవల్లి నివాసంలో మంత్రిని మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో గో సంరక్షణకు గోశాలల నిర్మాణ ఆవశ్యకత, దేవాదాయ భూముల పరిరక్షణ, పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ తదితర అంశాలపై చర్చించారు. రాష్ట్రంలో డ్రగ్స్ పై ఎటువంటి కఠిన చర్యలు తీసుకుంటున్నారో అదేవిధంగా అక్రమ గో రవాణా, గోవధపై కఠినమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. పంచాలయ వ్యవస్థగా దేవాలయాలను తీర్చిదిద్దాలని అన్నారు.

ధార్మిక ప్రచారం, సామాజిక సేవా కార్యక్రమాలను దేవాలయాల ద్వారా నిర్వహించాలని కోరారు వీహెచ్ పీ నేత‌లు. ధార్మికతకు భంగం కలగని విధంగా దేవాలయ భూములపై ఆదాయం పెంచే మార్గాలు పరిశీలించాల‌ని సూచించారు. దేవాలయ భూములను దీర్ఘకాలిక లీజుకు ఇచ్చే విధానాన్ని సవరించాలని అన్నారు. అన్యాక్రాంతమైన దేవాలయ భూములను వెంటనే స్వాధీనం చేసుకుని పరిరక్షించాలన్నారు. గత ప్రభుత్వంలో హిందువులపై బనాయించిన అక్రమ కేసులను తొలగించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా పూర్తిస్థాయి ధార్మిక పరిషత్తును హిందూ థార్మిక సంస్థల ప్రతినిధులు, ధార్మిక పెద్దలతో ఏర్పాటు చేయాలని సూచించారు. హిందూ సమాజాన్ని జాగృతం చేసి భక్తిభావాన్ని పెంపొందించేందుకు విశ్వహిందూ పరిషత్ ప్రభుత్వంతో కలిసి పని చేస్తుందని వారు పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో హైందవ భక్తులపై పెట్టిన అక్రమ కేసులను తొలగిస్తామని, హిందూ ధర్మ పరిరక్షణకు పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామని మంత్రి లోకేష్ హామీ ఇచ్చారు.

Leave A Reply

Your Email Id will not be published!