Jack Ma : చైనా వ్యాపార దిగ్గజం జాక్ మా జాడేది
జపాన్ లో ఉన్నట్లు ప్రచారం
Jack Ma : ప్రపంచ దిగ్గజ వ్యాపారవేత్తలలో ఒకడిగా పేరొందిన చైనాకు చెందిన జాక్ మా జాడ గత కొంత కాలం నుంచి కనిపించడం లేదు. 2020వ సంవత్సరంలో చైనా ప్రభుత్వాన్ని బహిరంగంగానే విమర్శించాడు. దీంతో జిన్ పింగ్ నేతృత్వంలోని ప్రభుత్వం కక్ష కట్టింది. ఆ మధ్య అతడిని చంపేసిందన్న ఆరోపణలు వచ్చాయి.
కానీ జాక్ మా సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో విడుదల చేశాడు. తాను క్షేమంగానే ఉన్నానని ప్రకటించాడు. ప్రస్తుతం జాక్ మా(Jack Ma) వయస్సు 58 ఏళ్లు. ఆనాటి నుంచి అడపా దడపా కనిపించడం తప్ప ఎక్కడా బయటకు రావడం లేదు. ప్రస్తుతం చైనా అట్టుడుకుతోంది.
కరోనా మహమ్మారి దెబ్బకు రోజుకు 40 వేల మంది కరోనా బారిన పడుతున్నారు. దీంతో చైనా సర్కార్ ముందు జాగ్రత్తగా కఠినమైన ఆంక్షలు విధించింది. దీనిని నిరసిస్తూ వేలాదిగా ప్రజలు రోడ్లపైకి వచ్చారు. జిన్ పింగ్ దిగి పోవాలంటూ నినాదాలు చేశారు. ఈ తరుణంలో చైనా బిలియనీర్ , ఇ కామర్స్ దిగ్గజం అలీబాబా ఫౌండర్ జాక్ మా ఎక్కడ ఉన్నాడనేది చర్చనీయాంశంగా మారింది.
ప్రస్తుతం జపాన్ లోని టోక్యోలో గత ఆరు నెలల నుంచి నివసిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా జాక్ మా(Jack Ma) తన కుటుంబంతో కలిసి టోక్యో నగరానికి దగ్గర లోని గ్రామీణ ప్రాంతాల్లో ఉంటున్నట్లు ఫైనాన్షియల్ టైమ్స్ వెల్లడించింది. ప్రత్యేక కథనం ప్రచురించింది. దీంతో జాక్ మా ఎక్కడ అన్న దానిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి.
Also Read : చైనాలో స్వర్ణ యుగం ముగిసింది – సునక్