మరోసారి హాట్ టాపిక్ గా మారారు భారతీయ జనతా పార్టీకి చెందిన యూపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ గా ఉన్న ఆయనపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈ ఏడాది ప్రారంభంలో ఏడుగురు మహిళా రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేశారు. ఆయనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆందోళన చేపట్టారు. చివరకు కేంద్రం దిగి వచ్చింది. బాధితులు చేసిన ఆరోపణలపై కమిటీ కూడా వేసింది. నెల రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. దీనికి మేరీ కోమ్ బాధ్యత వహించారు. నివేదిక ఇచ్చినా బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చేసిన ఆరోపణలను రుజువు చేయలేక పోయారంటూ పేర్కొంది.
దీనిని నిరసిస్తూ సోమవారం మరోసారి మహిళా రెజ్లర్లు ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు. దీంతో ఎంపీ బ్రిజ్ భూషణ్ చర్చనీయాంశంగా మారారు. ఆయన యూపీ బీజేపీలో బలమైన రాజకీయ నాయకుడిగా గుర్తింపు పొందారు. ఎన్నో ఆరోపణలు ఉన్నా అవేవీ తనను తగ్గించ లేక పోయాయి. ఆరుసార్లు ఎంపీగా గెలుపొందారు. కైసర్ గంజ్ కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్. 2011 నుంచి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (డబ్ల్యుఎఫ్ఐ) చీఫ్ గా కొనసాగుతూ వస్తున్నారు. కేంద్రం చెప్పినా ఆయన వినిపించు కోలేదు.
ప్రధానమైన ఆరోపణ ఎంపీపై తమను లైంగికంగా వేధింపులకు గురి చేస్తున్నాడని. ఒకరు కాదు ఇద్దరు కాదు ఏకంగా ఏడుగురు మహిళా రెజ్లర్లు సంచలన ఆరోపణలు చేశారు. తమ ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని వాపోయారు. చివరకు కమిటీ వేయడం, అది కూడా సక్రమంగా పని చేయడం లేదని బాధితులు ఆరోపించారు. తిరిగి మరోసారి ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆందోళనకు దిగారు మహిళా రెజ్లర్లు. ఎంపీ పదవిని, డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ గా ఉన్న బ్రిజ్ భూషణ్ గత కొన్నేళ్లుగా మహిళా రెజ్లర్లను లైంగికంగా దోపిడీ చేస్తున్నాడంటూ వినేష్ ఫోగట్ ఆరోపించారు.
బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ యూపీలోని గోండా జిల్లా వాసి. యువ్వనంలో ఉన్నప్పుడు మల్ల యోధుడిగా గుర్తింపు పొందారు. 1980లో రాజకీయాల్లో చేరాడు. రామమందిరం ఉద్యమ సమయంలో పేరు పొందాడు. 1991లో ఎంపీగా పోటీ చేశాడు. 1999, 2004, 2009, 2014, ,2019 లలో ఎంపీగా గెలుపొందారు. బాబ్రీ మసీదు కూల్చివేత కేసుకు సంబంధించిన నిందితుల్లో సింగ్ ఒకరు. తర్వాత నిర్దోషిగా విడుదలయ్యాడు. ఇదిలా ఉండగా తనపై రెజ్లర్లు చేసిన ఆరోపణలు అవాస్తవమని పేర్కొన్నాడు. నిరూపిస్తే సూసైడ్ చేసుకుంటానని ప్రకటించాడు. మొత్తంగా బ్రిజ్ భూషణ్ సింగ్ మరోసారి చర్చకు దారితీశాడు.