Yashasvi Jaiswal : చుక్కలు చూపించిన జైశ్వాల్
8 ఫోర్లు 4 సిక్సర్లతో ధనా ధన్
Yashasvi Jaiswal : ఐపీఎల్ 16వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ యశస్వి జైశ్వాల్(Yashasvi Jaiswal) దుమ్ము రేపాడు. ఆకాశమే హద్దుగా చెలరేగాడు. రాజస్థాన్ లోని సవాయ్ మాన్ సింగ్ స్టేడియంలో జరిగిన కీలక లీగ్ పోరులో సత్తా చాటాడు మరోసారి. చెన్నై బౌలర్లకు చుక్కలు చూపించాడు. దీంతో రాజస్థాన్ జట్టు మొదటిసారిగా తన స్వంత మైదానంలో 200 పరుగుల మార్క్ ను దాటింది.
రాజస్థాన్ రాయల్స్ స్కిప్పర్ సంజూ శాంసన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మైదానంలోకి వచ్చీ రావడంతోనే బాదడం మొదలు పెట్టాడు. ఒక రకంగా చెప్పాలంటే యశస్వి జైశ్వాల్ శివమెత్తాడు. బౌలర్ల భరతం పట్టాడు. ఫోర్లు, సిక్సర్లతో ఊచ కోత కోశాడు. ఈ 21 ఏళ్ల యువ క్రికెటర్ కళ్లు చెదిరే షాట్స్ తో అలరించాడు. ఒకానొక దశలో మహేంద్ర సింగ్ ధోనీ మౌనంగా ఉండిపోయాడు. అతడి షాట్స్ ను చూస్తూ ఎంకరేజ్ చేశాడు.
జైశ్వాల్ 8 ఫోర్లు 4 సిక్స్ లతో 77 పరుగులు చేశాడు. కేవలం 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేశాడు. ఈ లీగ్ లో వరుసగా జైశ్వాల్ హాఫ్ సెంచరీ చేయడం విశేషం. తుఫాన్ ఇన్సింగ్స్ దెబ్బకు రాజస్థాన్ రాయల్స్ 10 ఓవడ్లలోనే 100 పరుగుల మార్క్ దాటింది.
ఆ తర్వాత ఆఖరులో వచ్చిన యశ్ ధ్రువల్ , పడిక్కల్ స్కోర్ బోర్డు పరుగెత్తించారు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 202 రన్స్ చేసింది. చెన్నై 6 వికెట్లు కోల్పోయి 170 పరుగులు మాత్రమే చేసింది. అద్భుతమైన ఇన్నింగ్స్ తో ఆకట్టుకున్న జైశ్వాల్ కు(Yashasvi Jaiswal) మ్యాన్ ఆఫ్ ది ప్లేయర్ అవార్డు దక్కింది.
Also Read : శివమ్ శివమెత్తినా తప్పని ఓటమి