Youtuber Jyoti Malhotra: యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

 

 

పాకిస్థాన్‌ కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన హరియాణా యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. ఈ ఘటనకు ముందు జ్యోతి పహల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్లు సమాచారం. ఆ సమాచారాన్ని పాక్‌ ఏజెంట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పహల్గాం దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్థాన్‌లో పర్యటించిందని, ఒకసారి చైనాకూ వెళ్లొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్‌ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్‌తో టచ్‌లో ఉన్నట్లు నిర్ధరించారు.

 

ట్రావెల్ బ్లాగర్‌, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్‌ విత్‌ జో పేరుతో ఓ యూట్యూబ్‌ ఛానెల్‌ నిర్వహిస్తోంది. 2023లో పాక్‌కు వెళ్లిన సమయంలో డానిష్‌ ఆమెకు పరిచయమయ్యాడు. భారత్‌ కు వచ్చిన తర్వాత కూడా అతడితో సంప్రదింపులు కొనసాగించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. అతడి సూచన మేరకు… అలీ అహ్సాన్‌ అనే వ్యక్తిని ఆమె కలిసింది. అతడు పాక్‌ నిఘా, రక్షణ విభాగాలకు చెందిన వ్యక్తులను జ్యోతికి పరిచయం చేసినట్లు సమాచారం. దేశ రక్షణకు చెందిన అత్యంత సున్నితమైన సమాచారాన్ని ఆమె పాక్‌ వ్యక్తులకు చేరవేసినట్లు అధికారులు ఆరోపించారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే ఆమె ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాను కూడా భారత్‌లో నిలిపివేశారు.

 

 

హైదరాబాద్‌ లో జ్యోతి మల్హోత్రా జాడలు

యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా జాడలు హైదరాబాద్‌ లోనూ కనిపించాయి. 2023 సెప్టెంబరులో ప్రధాని మోదీ వర్చువల్‌ గా హైదరాబాద్‌-బెంగళూరు వందేభారత్‌ రైలును ప్రారంభించిన సమయంలో ఆమె హడావుడి చేశారు. సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో అప్పటి గవర్నర్‌ తమిళిసైతోపాటు కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ పాల్గొన్న కార్యక్రమంలో యూట్యూబర్‌గా వీడియోలు చేస్తూ హల్‌చల్‌ చేశారు. తాజాగా ఆమె అరెస్ట్‌ కావడంతో అప్పటి ఆమె వీడియోలు, చిత్రాలు తాజాగా సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే, హైదరాబాద్‌ వచ్చిన సమయంలో ఆమె ఎవరినైనా కలిశారా? కలిస్తే అక్కడ ఏమైనా వీడియోలు తీశారా? అన్న కోణాల్లో నిఘా వర్గాలు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

పూరీలోనూ జ్యోతి జాడలు

ఇదిలా ఉండగా.. తాజాగా జ్యోతి మల్హోత్రాతో పూరీకి చెందిన మరో యూట్యూబర్‌ ప్రియాంక సేనాపతికి ఉన్న సంబంధంపై ఒడిశా పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాక్‌కు గూఢచర్యం కేసులో జ్యోతితోపాటు ఆమెకు సహకరించిన మరో ఆరుగురిని హర్యానా పోలీసులు అరెస్టు చేశారు. నిందితురాలి సోషల్‌ మీడియా ఖాతాలను పరిశీలించగా, ఆమెకు ఒడిశాలోని పూరీకి చెందిన ప్రియాంకతో సన్నిహిత సంబంధాలున్నట్లు గుర్తించారు. ఆ విషయాన్ని పూరీ పోలీసు యంత్రాంగానికి తెలియజేయడంతో ఎస్పీ వినీత్‌ అగర్వాల్‌ ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు.

2024 సెప్టెంబరు 26న పూరీ వచ్చిన జ్యోతి… ఇక్కడి శ్రీక్షేత్రాన్ని సందర్శించినట్లు తెలిసింది. స్థానికంగా ఓ హోటల్లో ఉన్న ఆమె దర్శనీయ ప్రాంతాలకు వెళ్లారు. ఆ సమయంలో ప్రియాంక ఆమెతో కలిసి తిరిగారు. శ్రీక్షేత్రంపై ఉగ్రవాదుల కళ్లున్నాయని కేంద్ర ఇంటెలిజెన్స్‌ వర్గాలకు సమాచారం ఉంది. ఈ పరిస్థితిలో జ్యోతి జగన్నాథస్వామి దర్శనానికి వచ్చారా? లేక రెక్కీ చేసి, పాక్‌ కు ఏదైనా సమాచారం అందించారా ? అన్న దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక, ప్రియాంక మూడు నెలల క్రితం పాక్‌లోని కర్తార్‌పుర్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ దేశానికి ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం చేశారు? ఎవరెవర్ని కలిశారు? అన్న అంశాలు కీలకంగా మారాయి.

 

పాక్‌లోని కర్తార్‌పుర్‌ సందర్శించిన ప్రియాంక సేనాపతి

ప్రియాంక మూడు నెలల క్రితం పాకిస్థాన్‌లోని కర్తార్‌పుర్‌ను సందర్శించారు. ఈ నేపథ్యంలో ఆమె ఆ దేశానికి ఎందుకు వెళ్లారు? అక్కడ ఏం చేశారు? ఎవరెవర్ని కలిశారు? అన్న అంశాలు కీలకంగా మారాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ప్రియాంక ఆదివారం వివరణ ఇచ్చారు. ‘జ్యోతి మల్హోత్రా పాక్‌ గూఢచారిణి అని నాకు తెలియదు. పూరీ వచ్చిన ఆమెను స్నేహితురాలిగా భావించి, కలిసిమెలిసి తిరిగా. నేను పాకిస్థాన్‌కు విహారయాత్ర కోసం వెళ్లా. అంతకుమించి ఏమీ లేదు. పోలీసుల దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తా’ అని పేర్కొన్నారు. ప్రియాంక తండ్రి రాజ్‌కిశోర్‌ సేనాపతి కూడా అదే విషయాన్ని విలేకర్లకు చెప్పారు. హరియాణా పోలీసులతో కలిసి అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని ఎస్పీ వినీత్‌ పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఇప్పుడే చెప్పలేమన్నారు. దర్యాప్తు కొలిక్కి వచ్చేవరకు ప్రియాంకను పూరీ విడిచి వెళ్లరాదన్న పోలీసులు.. సైబర్‌ నిపుణులతో కలిసి సదరు యూట్యూబర్‌ వీడియోలను శోధిస్తున్నట్లు తెలిసింది.

 

Leave A Reply

Your Email Id will not be published!