వైఎస్సార్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిలను పోలీసులు అరెస్ట్ చేశారు. పార్టీ ఆఫీసు ముందు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆమెను అదుపులోకి తీసుకుంటున్న సమయంలో వైఎస్ షర్మిల రెచ్చి పోయారు. విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ అని చూడకుండా చెంపపై కొట్టారు. ప్రస్తుతం షర్మిల ప్రవర్తించిన తీరు పట్ల రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్ సీరియస్ అయ్యారు. చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. శాంతి భద్రతలను అదుపులో పెట్టడం పోలీసుల బాధ్యత అని పేర్కొన్నారు. బాధ్యత కలిగిన నాయకురాలు ఇలా వ్యవహరించడం తగదని అన్నారు.
ఇదిలా ఉండగా వైఎస్ షర్మిను అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమెను జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఆఫీసు నుంచి బయటకు వెళ్లాలని ప్రయత్నం చేశారు షర్మిల. ఆమె తప్పించుకునేందుకు ప్రయత్నం చేసింది. ఈ సమయంలో పోలీసులకు ఆమెకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఆమె వారిని నెట్టి వేసే ప్రయత్నం చేశారు. లోటస్ పాండ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
తనను ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పాలని షర్మిల డిమాండ్ చేశారు. ఆమె వెంట గన్ మెన్ ను కూడా అనుమతించ లేదు. ఇదే విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు షర్మిల. రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని ఆరోపించారు. ప్రశ్నించే హక్కు కూడా లేకుండా చేస్తున్నారంటూ ధ్వజమెత్తారు.