YS Sharmila: వైసీపీకు షర్మిల సవాల్ !

వైసీపీ నాయకులకు షర్మిల సవాల్ !

వైసీపీ నాయకులకు షర్మిల సవాల్ !

 

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఏపీపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల, వైసీపీ నాయకుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కాంగ్రెస్ పార్టీ తన కుటుంబాన్ని విచ్ఛిన్నం చేయడానికి ప్రయత్నిస్తుందని సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలపై షర్మిల ఘాటుగా సమాధానం ఇచ్చారు. అసలు కుటుంబం విచ్ఛిన్నం కావడానికి జగన్మోహన్ రెడ్డి కారణమని, దీనికి తన తల్లి విజయమ్మ సాక్ష్యం అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. దీనితో వైసీపీ నేత కొండా రాఘవరెడ్డి మరో అడుగు ముందుకేసి స్వప్రయోజనాల కోసమే షర్మిల పాదయాత్ర చేసిందని, అక్రమ సంపాదన కోసం తన భర్త అనిల్ తో కలిసి జగన్మోహన్ రెడ్డి వద్దకు వెళ్ళారని సంచలన ఆరోపణలు చేసారు. మరోవైపు మొరుసుపల్లి షర్మిల శాస్త్రికి వైఎస్ ఇంటిపేరు పెట్టుకునే అర్హత లేదంటూ వైసీపీకు చెందిన సోషల్ మీడియా ప్రతినిధులు తీవ్ర స్థాయిలో ట్రోల్ చేస్తున్న విషయంపై… షర్మిల ఘాటుగా స్పందించారు.

విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న షర్మిల… ఇతర సీనియర్ నాయకులతో కలిసి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతలు చేస్తున్న ఆరోపణలు, సోషల్ మీడియా చేస్తున్న ట్రోల్స్ పై తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ…. “ఎవరైనా కితాబు ఇచ్చినంత మాత్రానా నా విలువ ఎక్కువ కాదు, ఇవ్వకపోతే నా విలువ తక్కువా కాదు. నేను వైఎస్‌ఆర్‌ కుమార్తెను అయినప్పుడు వైఎస్‌ షర్మిల కాకుండా ఎలా ఉంటాను. నా కుమారుడికి వైఎస్ రాజారెడ్డి అని పేరు పెట్టుకున్నా. నా తండ్రి రాజశేఖర రెడ్డి స్వయంగా తన తండ్రి, నా తాత రాజా రెడ్డి పేరు నా కుమారుడికి పెట్టారు. కాబట్టి ఆయన వైఎస్ రాజారెడ్డి కాకుండా ఏమౌతారు అని ఆమె వైసీపీ నాయకులను ప్రశ్నించారు. పులి కడుపున పులే పుడుతుంది. ఎవరు అవునన్నా… కాదన్నా నేను వైఎస్ షర్మిలా రెడ్డి అని ఆమె స్పష్టం చేసారు.

 

అలాగే చాలా మంది వైసీపీ నాయకులు ఎన్నోన్నో మాట్లాడుతున్నారు. నాకు చాలా దగ్గర మనిషి కొండా రాఘవరెడ్డి అన్న కూడా చాలా విచిత్రంగా మాట్లాడుతున్నారు. భారతి చేయాల్సిన పాదయాత్రను… నా స్వార్ధం కోసం నేను చేసానని జైలు అధికారి చెప్పారని అంటున్నారు. అప్పటి జైలు అధికారితో ఈ విషయం చెప్పించగలరా ? మీ ఆరోపణలు నిజం కాదని నేను ప్రమాణం చేయగలను. మీరు చేయగలరా ? అని కొండా రాఘవరెడ్డికి ఆమె సవాల్ విసిరారు. అంతేకాదు అక్రమంగా సంపాదించుకోవడానికి నా భర్తతో జగన్ వద్దకు వెళ్లానని అభాండాలు వేస్తున్నారు. నేను ఎప్పుడూ ఏదీ ఆశించి నా అన్న వద్దకు వెళ్లలేదు. జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత నేను ఒకే ఒక్కసారి విజయమ్మగారితో వెళ్ళి కలిసాను. నా భర్త అనిల్ ఇంతవరకు జగన్ ను కలవలేదు. దమ్ముంటే ఇది నిజమో కాదో నా తల్లి విజయమ్మతో చెప్పించండి’’ అని షర్మిల వ్యాఖ్యానించారు.

 

Leave A Reply

Your Email Id will not be published!