Senior Citizens Comment : ‘పండుటాకులు’ పనికి రారా
కేంద్ర సర్కార్ నిర్ణయంపై ఆందోళన
Senior Citizens Comment : భారత రాజ్యాంగం గురించి పదే పదే ప్రస్తావించాల్సి వస్తోంది. ఇది భావ్యం కాదు. కానీ తప్పడం లేదు. ఈ దేశంలో పుట్టిన ప్రతి ప్రాణికి హక్కులు ఉన్నాయి. వాటిని కాపాడాల్సిన బాధ్యత ఏలుతున్న పాలకులు, వాటిని సంరక్షిస్తున్న ప్రభుత్వాలపై ఉంది.
ఇది కాదనలేని సత్యం. విద్య, వైద్యం, న్యాయం, ఆకలితో లేకుండా చూడటం, మెరుగైన జీవన సౌకర్యాలను కల్పించడం బాధ్యత. జీవితంలో చరమాంకంలో ఉన్న వారి పరిస్థితి దయనీయంగా ఉంటుంది.
ఎక్కడా చెప్పుకోలేరు. ఎవరినీ తప్పు పట్టలేరు. అటు చావుకు ఇటు బతుక్కి మధ్య నరక యాతన అనుభవిస్తూ ఉన్న సమూహం ఏదైనా ఉందంటే అది వృద్యాప్యమే(Senior Citizens). దేశానికి స్వేచ్ఛ లభించి 75 ఏళ్లవుతోంది.
కానీ 135 కోట్ల సమున్నత భారతంలో కోట్లాది మంది వృద్దులు అరకొర జీవితం గడుపుతున్నారు. ఇది కాదనలేని వాస్తవం. అభివృద్ది చెందిన దేశాలలో వారికి హక్కులు ఉంటాయి.
వారి అనుభవాలను, ఆలోచనలను ఈ దేశానికి ఉపయోగపడేలా చేయడంలో పాలకులు ఫోకస్ పెట్టాలి. కానీ అదేమీ లేదు. సభ్య సమాజంలో వృద్దులంటే , సీనియర్ సిటిజన్లు (వయస్సు పైబడిన వారు) అంటే చులకన భావం.
వాళ్లు ఎందుకూ పనికి రారని. కానీ ఇతర దేశాలలో వారికి ఎనలేని రెస్పెక్ట్ ఉంటుంది. ఉండాలి కూడా. ఎందుకంటే వాళ్లు లేకపోతే మనం లేమన్న సంగతి మరిచి పోతే ఎలా. తరాలు మారాయి. టెక్నాలజీ మారింది.
కానీ రాను రాను వృద్దుల పట్ల వివక్ష మరింత పెరుగతోంది. అంతే కాదు గతంలో ఎన్నడూ లేని రీతిలో వృద్దాశ్రమాలు పుట్ట గొడుగుల్లా పుట్టుకు వస్తున్నాయి.
కొందరు ఎందుకు బతికి ఉన్నామంటూ ఆత్మ గౌరవం కోసం బలవంతపు చావును కొని తెచ్చుకున్న సందర్భాలు చాలా ఉన్నాయి. ఇంకొందరు ఆస్తుల కోసం బయటకు నెట్టబడిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
గతంలో వృద్దులు, సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులు, ట్రాన్స్ జెండర్లకు ప్రయాణాలలో రాయితీలు కల్పించింది గతంలో కాంగ్రెస్ సర్కార్. కానీ పిడుగులాంటి షాక్ ఇచ్చింది కేంద్రంలో కొలువు తీరిన నరేంద్ర మోదీ సారథ్యంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం.
అత్యధికంగా వృద్దులు ప్రయాణం చేస్తున్నది దేశ వ్యాప్తంగా ప్రయాణం చేసే రైల్వేలలోనే.
తాజాగా పార్లమెంట్ లో రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తాము ఇక నుంచి సీనియర్ సిటిజన్లకు రాయితీలు ఇవ్వలేమంటూ ప్రకటించారు. ఇది కోలుకోలేని షాక్. అంతకంటే వృద్దుల పట్ల వివక్షను ప్రదర్శించారు.
ఇది క్షమించరాని నేరం. నిండు సభలో ఖరాఖండిగా చెప్పేశారు. కీలక ప్రకటన చేశారు. కరోనా దెబ్బకు ఆర్థిక వ్యవస్థ ఇబ్బందికరంగా మారిందని అందుకే ఛార్జీలపై మినహాయింపును రద్దు చేస్తున్నట్లు వెల్లడించారు.
గత ఏడాది ప్రయాణీకుల సేవలపై సబ్సిడీ కింద రూ. 59 వేల కోట్లు ఖర్చు చేశామన్నారు. తమ శాఖపై పెన్షన్ , జీతాల భారం కూడా ఎక్కువగా ఉందన్నారు. గతంలో ప్రయాణికుడికి 53 శాతం తగ్గింపు ఇచ్చేది.
ప్రయాణంలో రాయితీ రద్దు చేయడం కారణంగా 63 లక్షల మంది సీనియర్ సిటిజన్లు(Senior Citizens) రైలు లో ప్రయాణం చేయడం మానేశారు. కేవలం రాయితీ లేక పోవడం వల్లనే . మరో వైపు కేంద్రం దీనిని సాకుగా చూపిస్తూ కప్పదాటు ధోరణి ప్రదర్శిస్తోంది.
ఇదే సమయంలో బడా బాబులు, ఆర్థిక నేరగాళ్లు, ప్రభుత్వ బ్యాంకులలో రుణాలు తీసుకుని చెల్లించని వారికి గత 5 ఏళ్లలో రూ. 10 లక్షల కోట్లను రైటాఫ్ (మాఫీ ) చేసింది. అంతే కాదు పన్ను రాయితీల రూపంలో కార్పొరేట్ కంపెనీలకు రూ. 1.84 లక్షల కోట్ల రూపాయలు లబ్ది చేకూర్చింది.
కానీ రైళ్లలో ప్రయాణం చేసే వృద్దులకు మాత్రం రాయితీ ఇచ్చేందుకు మనసు ఒప్పలేదు. ఇకనైనా కేంద్ర సర్కార్ మానవతా దృక్ఫథంతో ఆలోచించాలి. వృద్దులను ఆదుకోవాలి.
Also Read : బెయిల్ పిటిషన్లను విచారించ వద్దు – రిజిజు