Ajinkya Rahane Comment : మానని గాయం సక్సెస్ కు సోపానం
అజింక్యా రహానే కలకాలం వర్దిల్లు
Ajinkya Rahane Comment : జీవితానికి ఆటకు చాలా దగ్గరి సంబంధం ఉంది. మైదానంలో కదిలే బంతులు, చేసే పరుగులు, బౌండరీలు దాటే సిక్సర్లు కోట్లాది గుండెల్ని లబ్ డబ్ మనేలా చేస్తాయి. అందుకే క్రికెట్ అంటే అంత ఆదరణ. అదో పిచ్చి. అంతకు మించి ప్రపంచాన్ని మెస్మరైజ్ చేస్తున్న క్రీడల్లో ఇది కూడా చేరి పోయింది. అంతెందుకు పెద్దన్న అమెరికా సైతం క్రికెట్ ను ఆడేందుకు ఉవ్విళ్లూరుతోంది. ఇది పక్కన పెడితే క్రికెట్ లో గెలుపు ఓటములు సహజం. ఒక్కోసారి ఒకే ఒక్క పరుగు తేడాతో గెలుపొందిన దాఖలాలు ..ఇంకోసారి విజయపు అంచుల దాకా వచ్చి గెలుస్తామని ధీమాగా ఉన్న సమయంలో ఓటమి పాలైన సందర్బాలు లేక పోలేదు. ఇది పక్కన పెడితే ప్రతి ఆటలో ఎత్తులు పల్లాలు కూడా ఉంటాయి. అలాగే బతుకులో నిత్యం తారస పడే కన్నీళ్లు, కష్టాలు, ఇబ్బందులు, ఆవేశాలు, ఆలోచనల్లాగే.
ఆట వ్యాపారంగా మారిన ప్రస్తుత సమయంలో ప్రతి బంతి, ప్రతి పరుగు కీలకమైనదే. ఎక్కడ లేని ఒత్తిళ్లు తట్టుకుని నిలబడాలి. పరుగుల వరద పారించాలి. గెలుపే లక్ష్యంగా సాగాలి. కానీ ఈ అలుపెరుగని పోరులో ఒక్కోసారి కింద పడి పోవడం మామూలే. కానీ జట్టును విజేతగా నిలిచేలా చేసిన వాళ్లనే క్రీడా , క్రికెట్ లోకం గుర్తుంచుకుంటుంది. సెంచరీలు చేసినా, హాఫ్ సెంచరీలతో ఆకట్టుకున్నా పట్టించు కోదు. ఈ ప్రపంచమే అంత. ఎందుకంటే లేచి నడిచి వచ్చే వాళ్లకు పల్లకీ మోస్తుంది. చివరి దాకా నిలిచి పడి పోయిన వాళ్లను పక్కన పెడుతుంది. ఇది ముమ్మాటికీ కాలం మిగిల్చిన గాయం. మానని గాయం ఫామ్ లేమి రూపంలో వేధిస్తుంటే కొందరు ఆటగాళ్లు నీరస పడి పోతారు. మరికొందరు అర్ధాంతరంగా కనుమరుగై పోతారు.
కానీ భారత జట్టుకు చెందిన అజింక్యా రహానే(Ajinkya Rahane) మాత్రం పడి లేచిన కెరటంలా తనను తాను మళ్లీ నిరూపించుకున్నాడు. ఐపీఎల్ లో తన సహజ సిద్దమైన ఆట తీరుకు భిన్నంగా ఆడాడు. చెన్నై సూపర్ కింగ్స్ ఛాంపియన్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. ఆపై వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ కు ఎంపికయ్యాడు. ఓ వైపు టీమిండియా వికెట్లను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్న సమయంలో నేనున్నాంటూ రహానే(Rahane) ఆస్ట్రేలియాకు అడ్డు గోడలా నిలిచాడు. ఫాలో ఆన్ నుంచి తప్పించాడు. 89 పరుగులు చేసి భారత జట్టు పరువును కాపాడాడు. గాయం కాని వాళ్లు లేరు. మనిషి అంటేనే కష్ట సుఖాల సమ్మేళనం. ఆట అంటేనే గెలుపు ఓటముల కలయిక. ఎంతగా గాయపడితే తాను అంతగా రాటు దేలుతానంటాడు రహానే. అవును..మనిషి ఎదగాలంటే..సక్సెస్ పొందాలంటే గాయాలతో సహవాసం చేయాల్సిందే. జీతే రహో అజింక్యా..హ్యాట్సాఫ్ యూ..ఫరెవర్.
Also Read : Tejasvi Surya : ‘హెడ్గే వార్’ తొలగింపుపై ‘సూర్య’ ఫైర్