Electroal Bonds: ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన ఎస్బీఐ !
ఎలక్టోరల్ బాండ్స్ పై సుప్రీం కోర్టుకు అఫిడవిట్ దాఖలు చేసిన ఎస్బీఐ !
Electroal Bonds: రాజకీయ పార్టీలకు నిధులు సమకూర్చిన ఎలక్టోరల్ బాండ్స్ పై అఫిడవిట్ ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బుధవారం సుప్రీంకోర్టుకు దాఖలు చేసింది. కోర్టు ఆదేశాల మేరకు ఈ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను ఎస్బీఐ నిన్న కేంద్ర ఎన్నికల సంఘానికి అందజేసిన విషయం తెలిసిందే. తాజాగా దీనిపై బ్యాంకు సర్వోన్నత న్యాయస్థానానికి అఫిడవిట్ సమర్పించింది. ఏప్రిల్ 1, 2019 నుంచి… ఫిబ్రవరి 15, 2024 వరకు మొత్తంగా 22,217 ఎలక్టోరల్ బాండ్స్ ను జారీ చేసినట్లు వెల్లడించింది. ‘‘కోర్టు ఆదేశాల మేరకు గత ఐదేళ్లలో మేం జారీ చేసిన ఎలక్టోరల్ బాండ్స్ కు సంబంధించిన అన్ని వివరాలను మార్చి 12న ఈసీకి ఇచ్చాం. ఈ బాండ్లను ఎవరెవరు ఎంతకు కొనుగోలు చేశారు ? ఏ పార్టీలు ఎంత ఎన్ క్యాష్ చేసుకున్నాయి ? వంటి వాటి వివరాలను అందించాం’’ అని ఎస్బీఐ ఛైర్మన్ దినేశ్ కుమార్ సుప్రీంకు సమర్పించిన అఫిడవిట్ లో పేర్కొన్నారు.
Electroal Bonds – ఈసీ చేతికి ఎన్నికల బాండ్ల వివరాలు !
2019 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 15, 2024 వరకు మొత్తం 22,217 ఎలక్టోరల్ బాండ్స్(Electroal Bonds) ను దాతలు కొనుగోలు చేసినట్లు ఎస్బీఐ తమ అఫిడవిట్లో పేర్కొంది. ఇందులో 22,030 బాండ్లను పలు రాజకీయ పార్టీలు ఎన్ క్యాష్ చేసుకుని నిధులు తీసుకున్నట్లు తెలిపింది. మిగతా 187 బాండ్లను నిబంధనల ప్రకారం రిడీమ్ చేసి ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధిలో డబ్బు జమ చేసినట్లు వెల్లడించింది. అయితే వీటితో ఏ పార్టీకి ఎన్ని నిధులు దక్కాయన్నదానిపై ప్రస్తుతానికి పూర్తి స్పష్టత లేదు. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం… ఈ నెల 15 సాయంత్రం 5గంటల్లోగా ఈసీ ఈ సమాచారాన్ని వెబ్సైట్లో బహిరంగపరచాల్సి ఉంది.
కేంద్ర ప్రభుత్వం 2018లో ఎన్నికల బాండ్ల పథకాన్ని తీసుకొచ్చినప్పటి నుంచి ఈ ఏడాది ఫిబ్రవరి వరకు 30 విడతల్లో ఎస్బీఐ వీటిని విక్రయించింది. వ్యక్తులు/సంస్థలు వీటిని కొనుగోలు చేసి అర్హత కలిగిన రాజకీయ పార్టీలకు నిధుల కింద అందించాయి. నిబంధనల ప్రకారం… జారీ అయిన తేదీ నుంచి 15 రోజుల వరకే ఇవి చెల్లుబాటవుతాయి. ఆలోగా రాజకీయ పార్టీలు వాటిని ఎన్‌క్యాష్ చేసుకోవాలి. గడువు ముగిసిన తర్వాత మిగిలిపోయిన బాండ్లకు చెందిన నగదును పీఎం రిలీఫ్ ఫండ్‌కు జమ చేస్తారు. అయితే ఈ ఎలక్టోరల్ బాండ్స్ ను రద్దు చేస్తూ సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. అంతేకాదు గత ఐదేళ్ళలో ఎలక్టోరల్ బాండ్స్(Electroal Bonds) రూపంలో వివిధ రాజకీయ పార్టీలకు అందిన నిధుల వివరాలను వెల్లడించాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఈ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలు ఇవ్వడానికి ఎస్బీఐ కొంతమేర తాత్సారం చేసే ప్రయత్నం చేయడంతో… కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనితో ఎట్టకేలకు ఎస్బీఐ ఎలక్టోరల్ బాండ్స్ వివరాలను ఈసీకు, అదే విధంగా కోర్టుకు సమర్పించింది.
Also Read : Elon Musk : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) పనితీరుపై ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు