Calcutta High Court: ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు !
ఓబీసీ సర్టిఫికెట్ల రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు !
Calcutta High Court: పశ్చిమ బెంగాల్ లో 2010 నుంచి టీఎంసీ ప్రభుత్వం జారీ చేసిన ఓబీసీ సర్టిఫికెట్లను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2010-12 మధ్య రాష్ట్ర ప్రభుత్వం ఓబీసీ వర్గీకరణలో పేర్కొన్న 42 క్లాసులు… ఓబీసీ జాబితా పూర్తిగా ‘చట్టవిరుద్ధం’ అని స్పష్టం చేసింది. పశ్చిమబెంగాల్ బీసీ కమిషన్ సారథ్యంలో ‘వెస్ట్ బెంగాల్(West Bengal) కమిషన్ ఫర్ బీసీ యాక్ట్-1993 ప్రకారం కొత్తగా ఓబీసీల జాబితా రూపొందించాలని ఉత్తర్వుల్లో నిర్దేశించింది. బెంగాల్ లో 1993 చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఓబీసీల జాబితా రూపొందించారని, ఫలితంగా అసలు ఓబీసీలకు అన్యాయం జరిగిందంటూ 2011లో దాఖలైన పిల్ పై హైకోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. ఇప్పటికే ఓబీసీ సర్టిఫికెట్ల ద్వారా సర్వీసుల్లో ఉన్న వారికి, ఆ రిజర్వేషన్ కారణంగా ప్రయోజనం పొందిన వారికి, ఇప్పటికే ఏదైనా ఉద్యోగ పరీక్షల్లో విజయం సాధించి సెలెక్షన్ ప్రాసెస్ లో ఉన్నవారికి ఈ తీర్పు వర్తించదని స్పష్టం చేసింది.
అయితే హైకోర్టు తీర్పును అంగీకరించే ప్రసక్తే లేదని సీఎం మమత బెనర్జీ అన్నారు. రాష్ట్రంలో ఓబీసీ రిజర్వేషన్ల కోటా కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఓబీల రిజర్వేషన్లపై తాము ఇంటింటికి తిరిగి సర్వే చేశామని, రాజ్యాంగం ప్రకారం బిల్లు క్యాబినెట్లో ఆమోదం పొందిన తర్వాత అసెంబ్లీలోనూ ఆమోదింపజేసుకున్నామని వివరించారు. ఇది కచ్చితంగా బీజేపీ కుట్రేనని ఆమె ఆరోపించారు. ఈ తీర్పుపై స్టే కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిని హైకోర్టు తోసిపుచ్చింది. రాష్ట్ర ఓబీసీ జాబితాను సమీక్షించి చేరికలు, తొలగింపులపై సిఫార్సులతో శాసనసభకు నివేదిక ఇవ్వాలని… బీసీ కమిషన్తోనూ సంప్రదింపులు జరపాలని పశ్చిమబెంగాల్ బీసీ సంక్షేమ విభాగానికి ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
Calcutta High Court – సుప్రీంకోర్టుకు వెళతాం: మమత
పలు కులాల ఓబీసీ హోదాను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు(Calcutta High Court) ఇచ్చిన ఉత్తర్వులను తాము ఆమోదించేది లేదని, సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేస్తామని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎన్నికల ర్యాలీలో ప్రకటించారు. ఎన్నికల తరుణంలో ఓబీసీ రిజర్వేషన్లను అడ్డుకోడానికి బీజేపీ కుట్ర పన్నిందని ఆరోపించారు.
ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ: మోదీ
కలకత్తా హైకోర్టు 77 ముస్లిం ఉపకులాల ఓబీసీ హోదాను రద్దు చేస్తూ జారీ చేసిన ఉత్తర్వులు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్న ప్రతిపక్షాలకు గట్టి చెంపదెబ్బ అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఢిల్లీ ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ… ‘‘ముస్లిం అనే పదాన్ని నేను వాడినప్పుడల్లా మతపరమైన ప్రకటనలు చేస్తున్నానని ఆరోపించారు. వాస్తవాలు ప్రజల ముందుంచడం ద్వారా విపక్షాల ఓటుబ్యాంకు రాజకీయాలను బహిర్గతం చేయడమే నేను చేసిన పని’’ అన్నారు.
Also Read : Ambati Rambabu : ఏపీలో రీపోలింగ్ పై వేసిన పిటిషన్ కు హైకోర్టు కీలక వ్యాఖ్యలు