మెరుగైన సేవలు అందించేందుకు క్రీడలు అవసరం

టిటిడి సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు

తిరుపతి : ఉరుకులు పరుగులుగా సాగుతున్న నేటి ఆధునిక జీవన విధానంలో శారీరక, మానసిక అభివృద్ధికి అలాగే భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి క్రీడలు ఎంతో అవసరమని టిటిడి సంక్షేమ విభాగం డిప్యూటీ ఈవో ఆనందరాజు అన్నారు. టిటిడి ఉద్యోగుల వార్షిక క్రీడోత్సవాల ముగింపు కార్యక్రమం తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టిటిడి ఉద్యోగులు తీవ్ర ఒత్తిడిలో విధులు నిర్వహిస్తున్నారని ఆవేద‌న చెందారు. ఆ ఒత్తిడిని తగ్గించు కోవడానికి , శారీరక ఆరోగ్యాన్ని కాపాడు కోవడానికి క్రీడలు ఎంతో ఉపయోగ పడతాయని చెప్పారు. క్రీడల ద్వారా మనలోని కొత్త ప్రతిభా కోణాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు. ప్రతి రోజూ క్రీడలు, వ్యాయామం చేయడం అలవాటు చేసుకోవాలని, ఉద్యోగుల్లో క్రీడాస్ఫూర్తి పెరిగితే వారు ఆరోగ్యంగా ఉండటంతో పాటు విధులను మరింత సమర్థంగా నిర్వర్తించగలరని అభిప్రాయ‌ప‌డ్డారు.

టీటీడీ సిపిఆర్ఓ డాక్టర్ టి. రవి మాట్లాడుతూ, క్రీడల్లో పాల్గొనడం ద్వారా పోటీతత్వం పెరిగి మానసిక ఉల్లాసం కలుగుతుందని అన్నారు. క్రీడల వల్ల మానసిక ఉత్తేజం పెరిగి సంస్థలో మరింత ఉత్సాహంగా పని చేయడానికి ప్రేరణ లభిస్తుందని చెప్పారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యంగా ఉండేందుకు క్రీడలు, సంగీతం ఎంతో అవసరమని తెలిపారు. ప్రతి ఏడాది నిర్వహించే టిటిడి వార్షిక క్రీడల్లో 80 సంవత్సరాల పైబడిన విశ్రాంత ఉద్యోగులు సైతం ఉత్సాహంగా పాల్గొని ఉద్యోగులకు ఆదర్శంగా నిలుస్తున్నారని పేర్కొన్నారు.
అనంతరం టిటిడి ఉద్యోగుల పిల్లల కోసం సాంస్కృతిక పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. వివిధ క్రీడా పోటీలలో విజేతలుగా నిలిచిన వారికి సంక్షేమాధికారి ఆనందరాజు, డిప్యూటీ ఈవో గోవిందరాజన్ చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో ఉద్యోగుల్లో మొత్తం 616 మంది ప్రథమ, 533 మంది ద్వితీయ, 106 మంది తృతీయ బహుమతులు అందుకున్నారు. వివిధ విభాగాలకు చెందిన మొత్తం 2,400 మంది ఉద్యోగులు మరియు విశ్రాంత ఉద్యోగులు క్రీడాపోటీలలో పాల్గొన్నారు. వీరిలో 1,600 మంది పురుషులు, 800 మంది మహిళా ఉద్యోగులు ఉన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!