ఏబీఎన్-ఆంధ్రజ్యోతి ఆఫీస్ పై వైసీపీ దాడి దారుణం

కీల‌క ప్ర‌క‌ట‌న చేసిన సీఎం చంద్రబాబు నాయుడు

అమరావతి : హైదరాబాద్‌లో ఏబీఎన్ , ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ దాడి చేసేందుకు ప్ర‌య‌త్నం చేయ‌డాన్ని తీవ్రంగా ఖండించారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి కార్యాలయంపై వైసీపీ నేతలు, రౌడీలు దాడికి దిగడం మీడియా స్వేచ్ఛపై దాడిగా ముఖ్యమంత్రి అభివర్ణించారు. సొంతగా మీడియా సంస్థలను నడుపుతూ మీడియాను అడ్డుపెట్టుకుని అనైతిక చర్యలకు పాల్పడుతోన్న వైసీపీ… తమను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతిపై ఆరోపణలు, దూషణలు చేయడం అసంబద్ధం అన్నారు. వైసీపీ ఐదేళ్ల పాలనలో మీడియా సంస్థలపై, ఆంధ్రజ్యోతిపై అనేక వేధింపులకు, కుట్రలకు పాల్పడినా నిబ్బరంగా నిలిచాయి తప్ప భయపడలేదని ముఖ్యమంత్రి గుర్తు చేశారు.

రౌడీ మూకలను వెంటేసుకుని స్వయంగా ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు మీడియా కార్యాలయంపైకి వెళ్లడం వైసీపీ రౌడీ సంస్కృతికి నిదర్శం అని వ్యాఖ్యానించారు. ఆంధ్రజ్యోతి మేనేజింగ్ డైరెక్టర్ వేమూరి రాధాకృష్ణ దశాబ్ధాలుగా కేసులకు, దాడులకు, ఒత్తిళ్లకు భయపడకుండా పత్రికను, ఛానెల్‌ను నడుపుతున్నారన్నారు. దాడులు, నిరసనలు, బెదిరింపులతో మీడియాను భయపెట్టాలనే వైసీపీ రాజకీయాలకు కాలం చెల్లిందని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అధికారంలో ఉండగా మహిళల పట్ల, సొంత కుటుంబ సభ్యుల పట్ల వైసీపీ నాయకులు, ఆ పార్టీ అధ్యక్షుడు వ్యవహరించిన తీరును మహిళా సమాజం ఎప్పటికీ మర్చిపోదన్నారు. రాజధానిపై వైసీపీ కుట్రలను ప్రశ్నించిన ఆంధ్రజ్యోతి సంపాదకీయానికి సమాధానం చెప్పలేక దాడులు, నిరసనలతో వైసీపీ డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతోందని చంద్రబాబు దుయ్యబట్టారు.
ఇదిలా ఉండ‌గా వైసీపీకి చెందిన మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు , ప్ర‌జా ప్ర‌తినిధులు సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చారు ఆంధ్ర‌జ్యోతి, ఏబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణ‌కు.

Leave A Reply

Your Email Id will not be published!