హైదరాబాద్ : మాజీ మంత్రి హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ రాష్ట్రం పిచోడి చేతిలో రాయిలాగా అయి పోయిందన్నారు. ఇది భూసేకర కాదని, దళిత బలహీన వర్గాల మీద రేవంత్ రెడ్డి చేస్తున్న దండయాత్ర అని మండిపడ్డారు. మంగళవారం పరిగి నియోజకవర్గానికి వెళుతుండగా తనను అరెస్ట్ చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. రాచరిక పాలన సాగుతోందన్నారు. భూ కబ్జాలకు పాల్పడడం, రియల్ ఎస్టేట్ దందా చేయడం తప్పితే సీఎం చేస్తున్నది ఏమీ లేదన్నారు హరీశ్ రావు. రేవంత్ రెడ్డికి రాత్రి కలలో ఏం వస్తే ఉదయాన అదే పని చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. లగచర్లలో ఎలా అయితే దమనకాండ చేశాడో ఇక్కడ కూడా అదే చేస్తున్నాడని ఆరోపించారు.
హైడ్రా పేరిట, మూసీ పేరిట ఇండ్లు కూల్చే ప్రయత్నం చేశాడని, యూనివర్సిటీ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తే కోర్టు ఎంటర్ కావడంతో ఆగి పోయాడని, కానీ తన కబ్జా నైజాన్ని మాత్రం అలాగే కొనసాగిస్తూ వస్తున్నాడని ఆరోపించారు హరీశ్ రావు. కోహెడ ఫ్రూట్ మార్కెట్ భూమిని కూడా తన బంధుమిత్రులకు కట్టబెట్టే కుట్ర చేస్తున్నాడని ఫైర్ అయ్యారు. పరిగి గ్రామంలో కూడా భూములు లాకుంటున్నారని వాపోయారు. నువ్వెన్ని అరెస్టులు చేసినా పరిగి వెళ్లి తీరుతామని హెచ్చరించారు. సూర్యుడి చుట్టూ భూమి తిరిగినట్లు..నీ ఆలోచనలు ఎప్పుడూ భూముల చుట్టే ఉంటదా రేవంత్ రెడ్డి? అంటూ నిలదీశారు. ఇప్పుడు నీ పచ్చని కళ్లు పరిగి భూముల పడడం దారుణమన్నారు. పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని ఆరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. కడ్లాపూర్ గ్రామంలో రైతుల బాధలు వినేందుకు వెళుతున్నామన్నారు.
