తిరుమల : తిరుమల తిరుపతి దేవస్తానం (టీటీడీ) రికార్డు సృష్టించింది . లడ్డూల విక్రయాలలో గతంలో ఎన్నడూ లేనంతగా మే నెలలో ఒక కోటి 21 లక్షల లడ్డూలను విక్రయించింది. ఈ విషయాన్ని టీటీడీ అధికారికంగా ప్రకటించింది. శ్రీవారి పవిత్ర లడ్డూల విక్రయాలు సర్వకాల గరిష్ట స్థాయికి చేరుకోవడం విశేషం. టీటీడీ ప్రతిరోజూ 4 లక్షలకు పైగా లడ్డూలను తయారు చేస్తోంది. అత్యాధునిక సాంకేతికత , డిజిటల్ కియోస్క్‌లు కీలక పాత్ర పోషిస్తున్నాయి ఈ లడ్డూల విక్రయాలలో. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తులు అత్యంత ఆసక్తితో, భక్తిశ్రద్ధలతో స్వీకరించే ప్రసాదంగా పేరొందిన, అత్యంత ప్రసిద్ధ, పవిత్రమైన ‘లడ్డూ’ ప్రసాదం విక్రయాలు మే నెలలో సర్వకాల గరిష్ట స్థాయిని నమోదు చేశాయి.
సమస్త లోకాలకు అధిపతి అయిన ఆ కొండ దేవుని దర్శనం అనంతరం భక్తులు గాఢమైన విశ్వాసంతో స్వీకరించే శ్రీవారి లడ్డూ ప్రసాదం, తిరుమల యాత్రలో ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. నిరంతరం పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి టీటీడీ లడ్డూ ఉత్పత్తిని గణనీయంగా పెంచింది. నాణ్యతతో పాటు పారదర్శకతను పెంపొందించేందుకు అత్యాధునిక పరికరాలను వినియోగిస్తూ, భక్తులకు లడ్డూల సరఫరా నిరాటంకంగా, ఎటువంటి అంతరాయం లేకుండా సాగేలా చర్యలు చేపట్టింది. ఈ మే నెలలో నమోదైన రికార్డు స్థాయి విక్రయాలు 1,21,35,528 లడ్డూలు కాగా (12.13 మిలియన్లు) ఇదే నెలలో 2024లో 1.01 కోట్లు, 2025లో 1.10 కోట్ల లడ్డూలు విక్రయాలు జరిగినట్లు టీటీడీ తెలిపింది. ఈ గణాంకాలు ఏటా విక్రయాలు గణనీయంగా పెరుగుతున్న విషయాన్ని స్పష్టంగా తెలియ జేస్తున్నాయి. శ్రీవారి ప్రసాదాల తయారీలో నాణ్యతకు టీటీడీ అత్యంత ప్రాధాన్యత ఇస్తోంది. ఈ పవిత్ర లడ్డూల తయారీ కోసం ప్రతిరోజూ సుమారు 68 టన్నుల ముడి పదార్థాలను వినియోగిస్తున్నారు. ఇందులో పంచదార 32 టన్నులు, శనగపిండి 16 టన్నులు, నెయ్యి 16 టన్నులు, జీడిపప్పు 3.5 టన్నులు, ఎండు ద్రాక్ష 2 టన్నులు, యాలకులు 400 కిలోలు, కలకండ 800 కిలోలు వాడుతున్నారు.
ఒక లడ్డూను (సాధారణ పరిమాణం) తయారు చేయడానికి సుమారు 167-170 గ్రాముల ముడి పదార్థాలను వినియోగిస్తారు. ఇందులో సుమారు 78 గ్రాముల పంచదార, 39 గ్రాముల శనగపిండి, 36 గ్రాముల నెయ్యి, 07 గ్రాముల జీడిపప్పు, 03 గ్రాముల కిస్మిస్ మరియు ఇతర పదార్థాలు ఉంటాయి. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన తిరుపతి లడ్డూకు భారత ప్రభుత్వం ‘భౌగోళిక సూచిక’ (GI) హోదాను మంజూరు చేసింది. లడ్డూ తయారీ మరియు పంపిణీ కోసం టీటీడీ చెల్లుబాటయ్యే లైసెన్స్‌ను కలిగి ఉంది. ముడి పదార్థాల నుండి మలినాలను గుర్తించి తొలగించడానికి, శ్రీవారి పోటులో రెండు AI-ఆధారిత ‘రంగు-వర్గీకరణ యంత్రాలను’ ఏర్పాటు చేశారు. ఉపయోగానికి ఆమోదం తెలిపే ముందు, అన్ని పదార్థాలను ప్రయోగశాలలో పరీక్షించడం జరుగుతుంది. పవిత్రమైన లడ్డూ తయారీలో పాటించే సంప్రదాయ ‘దిట్టం’ ప్రమాణాలను టీటీడీ అత్యంత కచ్చితత్వంతో పాటిస్తోంది.
‘దిట్టం’ అంటే శ్రీ వేంకటేశ్వర స్వామి వారి పవిత్ర ప్రసాదాల తయారీలో ఉపయోగించాల్సిన పదార్థాల జాబితా , వాటి ఖచ్చితమైన నిష్పత్తులను సూచించే నియమావళి. ఈ ‘దిట్టం’ ప్రమాణాలకు టీటీడీ 1950–51లో ఆమోదం తెలిపింది. రోజువారీ, వారపు, పక్షంవారీ, నెలవారీ, నక్షత్ర-ఆధారిత వార్షిక ఉత్సవాల కోసం సుమారు 20 రకాల అన్నప్రసాదాలను 25 రకాల పిండి వంటలను తయారు చేస్తుంది.
