హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి

రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశం

అమరావతి : ఈ నెల 12 నుంచి నూతన విద్యా సంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో బీసీ హాస్టళ్లను, గురుకులాల భవనాలను సిద్ధం చేయాలని, విద్యార్థుల సంఖ్య పెంచేలా అడ్మిషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత ఆదేశించారు. బీసీ బిడ్డలెవరూ బడి బయట ఉండకూడదని స్పష్టం చేశారు. హాస్టళ్లు, తరగతి, విశ్రాంతి గదులను పరిశుభ్రం చేయాలని, పరిశుద్ధమైన నీరందించేలా చూడాలన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బీసీ సంక్షేమ శాఖాధికారులతో మంత్రి సవిత సమావేశం నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ హాస్టళ్లు, ఎంజేపీ స్కూళ్లలో అడ్మిషన్ల గురించి అడిగి తెలుసుకున్నారు. ఆర్వో ప్లాంట్లు, కిటికీలు, ద్వారాలకు దోమ తెరల ఏర్పాటు గురించి ఆరా తీశారు. బీసీ బిడ్దలు విద్యకు దూరంగా కాకూడదన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు.

కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి హాస్టళ్లు, గురుకుల పాఠశాలల్లో విద్యతో పాటు ఆరోగ్య, ఆహార భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. సన్నబియ్యంతో భోజనం, తల్లికి వందనం, విద్యా మిత్ర కిట్లు అందజేయడంతో పాటు సకాలంలో డైట్, కాస్మోటిక్ ఛార్జీల చెల్లింపు, పరిశుభ్రత, స్వచ్ఛమైన తాగునీటి కల్పనకు ప్రాధాన్యమివ్వడం వల్ల గతంలో ఎన్నడూ లేనంతగా టెన్త్, ఇంటర్ లో బీసీ హాస్టళ్లు, గురుకులాల విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారన్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచే బోధనపై ప్రత్యేక దృష్టి సారించడం ద్వారా మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని దిశా నిర్దేశం చేశారు. మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలకు విపరీతమైన డిమాండ్ ఉందన్నారు. బీసీ హాస్టళ్లలోనూ అడ్మిషన్లు పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా బీసీ బిడ్డలెవరూ బడి బయట ఉండకూడదన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!