నవ రత్నాలు కాదు నవ మోసాలు : కింజార‌పు

మాజీ సీఎం జ‌గ‌న్ రెడ్డిపై భ‌గ్గుమ‌న్న మంత్రి

అమ‌రావ‌తి : జగన్ పాదయాత్ర హామీలు, వైసీపీ మేనిఫెస్టో హామీలలో 85 శాతం అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారని అచ్చెన్నాయుడు విమర్శించారు. తల్లికి వందనం పథకం కింద హామీ ప్రకారం ప్రతి బిడ్డకు రూ.15 వేలు ఇస్తున్న కూటమి ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని చెప్పారు. అయితే ఇద్దరు పిల్లలకు అమ్మఒడి ఇస్తామని చెప్పి చివరకు ఒక్క బిడ్డకే పరిమితం చేసి వైసీపీ మోసం చేసిందన్నారు. అన్నదాత సుఖీభవ కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14 వేలు, కేంద్రంతో కలిపి రూ.20 వేలు అందిస్తున్నామని మోసం చేశార‌న్నారు. కానీ రైతు భరోసా పేరుతో జగన్ ఇచ్చిన హామీకి విరుద్ధంగా రాష్ట్ర నిధుల నుంచి కేవలం రూ.7,500 మాత్రమే ఇచ్చారని విమర్శించారు. ఉచిత బస్సు ప్రయాణం విజయవంతంగా అమలు అవుతుంటే వైసీపీ పాలనలో ఆర్టీసీ ఛార్జీలు మూడుసార్లు పెంచారని గుర్తు చేశారు. ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని అమలు చేస్తున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదిస్తున్నారని అన్నారు.

నిరుద్యోగ భృతి రద్దు చేసి యువతకు అన్యాయం చేసిన వ్యక్తి జగనేనని అచ్చెన్నాయుడు విమర్శించారు అచ్చెన్నాయుడు. మెగా డీఎస్సీ హామీ ఇచ్చి ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించ లేదన్నారు. ఏపీపీఎస్సీని అవినీతిమయం చేశారని, పరిశ్రమలను తరిమివేసి ఉపాధి అవకాశాలను దెబ్బతీశారని ఆరోపించారు. రెండేళ్లలోనే లక్షలాది ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించిన కూటమి ప్రభుత్వం అభివృద్ధి పథంలో రాష్ట్రాన్ని నడిపిస్తోందన్నారు మంత్రి. రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించి 24 లక్షల ఉద్యోగ అవకాశాలకు మార్గం సుగమం చేశామని చెప్పారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సబ్‌ప్లాన్ నిధుల్లో రూ.1.14 లక్షల కోట్లను దారి మళ్లించారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. పసుపు కుంకుమ, పెళ్లి కానుక వంటి పథకాలను రద్దు చేసి మహిళలకు అన్యాయం చేశారని అన్నారు. పెన్షన్ల విషయంలోనూ ప్రజలను మోసం చేశారని, సీఎం చంద్రబాబు నాయుడు ఒకేసారి పెన్షన్ పెంచితే జగన్ విడతలవారీగా పెంచి ప్రతి పెన్షన్‌దారుడికి వేల రూపాయల నష్టం కలిగించారని చెప్పారు. అన్న క్యాంటీన్లు రద్దు చేసి పేదల కడుపు కొట్టారని, మద్యనిషేధం హామీ ఇచ్చి మాట తప్పారని విమర్శించారు.

Leave A Reply

Your Email Id will not be published!