విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయండి

ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో నారా లోకేష్ భేటీ

ముంబయి: ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబ‌యిలో సమావేశమయ్యారు. ఆసియా పసిఫిక్, మిడిల్ ఈస్ట్, ఆస్ట్రేలియా, జపాన్, మలేషియా, హాంకాంగ్, సింగపూర్ లలో ఎయిర్ ట్రంక్ భారీ డేటా సెంటర్లను నిర్మించి నిర్వహిస్తోంది. ఈ భేటీలో మంత్రి లోకేష్ మాట్లాడుతూ…ఏఐ, డేటా హైపర్‌స్కేల్ హబ్‌గా వైజాగ్ ఆవిర్భవిస్తోంది. గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదానీకనెక్స్ ఇతర ప్రధాన ప్రాజెక్టులు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. డేటా సెంటర్ల ఏర్పాటుకు అన్నివిధాలా అనుకూలతలు కలిగిన విశాఖపట్నం డేటా సెంటర్ హబ్ గా వేగంగా అభివృద్ధి చెందుతోంది. విశాఖ నగరంలో 6 గిగావాట్ల డేటా సెంటర్లను ఏర్పాటుచేయాలన్నది మా లక్ష్యం. మల్టీ-గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాలు, సంపూర్ణ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై మేం దృష్టి సారించాం.

ఎయిర్ ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్ ను విశాఖపట్నంలో ఏర్పాటు చేయాల్సిందిగా మంత్రి లోకేష్ విజ్జప్తి చేశారు. భారతదేశంలో మరే ఇతర ప్రాంతాల్లో లేని కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు మావద్ద అందుబాటులో ఉన్నాయని తెలిపారు. డేటా సెంటర్లకు అవసరమైన విద్యుత్ కోసం రెన్యువబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు కూడా సిద్ధమవుతున్నాయన్నారు. ఏపీలో ఎయిర్ ట్రంక్ పెట్టుబడులు పెట్టాల్సిందిగా మంత్రి లోకేష్ కోరారు. ఎయిర్‌ట్రంక్‌తో సంబంధాలను పునరుద్ధరణ, భారతదేశంలో తదుపరి దశ విస్తరణ, AI- హైపర్‌స్కేల్ మౌలిక సదుపాయాలు, ఆంధ్రప్రదేశ్‌ను ఒక ప్రాధాన్య గమ్యస్థానంగా నిలిపే అంశంపై మంత్రి లోకేష్ చర్చించారు. రాబిన్ ఖుదా స్పందిస్తూ…ఎయిర్‌ట్రంక్ ఇండియా ప్రణాళికలు, మినా క్లౌడ్‌ఇన్‌ఫ్రాను స్వాధీనం చేసుకున్న తర్వాత దాని ఏకీకరణ, భారతదేశంలో ప్రణాళికాబద్ధమైన పెట్టుబడులు, విస్తరణ రోడ్‌మ్యాప్, కీలక కస్టమర్ సేవలు, హైపర్‌స్కేలర్ అవసరాలపై చర్చించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

Leave A Reply

Your Email Id will not be published!