కాళేశ్వరం తెలంగాణ‌కు వరం రేవంత్‌ రాష్ట్రానికి శనేశ్వరం

సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్

క‌రీంన‌గ‌ర్ జిల్లా : కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్‌ అవినీతి, అసమర్ధత వల్ల ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కుప్పకూలి 8 మంది మృతి చెందితే.ఇంతవరకూ మృతదేహాలు తీయలేని పరిస్థితి నెల‌కొంద‌న్నారు. మీ దరిద్రపు కాంగ్రెస్ హయాంలో సుంకిశాల గోడ కూలినా వట్టెం పంపుహౌస్‌ కొట్టుకు పోయినా పట్టించు కోక పోవడం దారుణ‌మ‌న్నారు.
కేసీఆర్‌పై రాజకీయ కక్షతో రైతులను గోస పెడుతున్నారంటూ వాపోయారు. కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్లు ఆన్ చేస్తే.. నీళ్లు వస్తాయని కాంగ్రెస్‌ నాయకులకూ తెలుసన్నారు. ఒకవేళ నీళ్లిస్తే యూరియా ఇవ్వాలి.. పంటలు పండితే మద్దతు ధర ఇవ్వాలి, కరెంటు ఇవ్వాలి, బోనస్‌ ఇవ్వాలనేది కాంగ్రెస్ భయం త‌ప్ప మ‌రోటి కాద‌న్నారు. ఎన్‌డీఎస్‌ఏ, ఎన్డీఏను అడ్డం పెట్టుకుని రేవంత్ టైమ్ పాస్ చేస్తున్నాడ‌ని మండిప‌డ్డారు.

కాళేశ్వరం కేసీఆర్‌ ఇచ్చిన వరం.. రేవంత్‌ రాష్ట్రానికి పట్టిన శనేశ్వరం అని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు కేటీఆర్. కేసీఆర్‌ కి వారం రోజులు కాళేశ్వరంను అప్పజెప్పు.. తెలంగాణ అంతటికీ నీళ్లు పారించి చూపుతాం రేవంత్ అని స‌వాల్ విసిరారు. ఎల్‌నినో, సూపర్‌ ఎల్‌నినో వస్తుందని మూడు నెలల క్రితమే అధికారులు చెప్పారన్నారు. 26 జిల్లాల్లో వర్షాభావ పరిస్థితులు నెల‌కొన్నాయ‌ని పేర్కొన్నారు. కాళేశ్వరంతో హైదరాబాద్‌ తాగునీటితో సహా ఉమ్మడి 7 జిల్లాలకు నీళ్లివ్వవచ్చు అని స్ప‌ష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్షతో పడావు పెడితే.. సాగునీళ్లే కాదు హైదరాబాద్‌ తాగునీటికి కటకట ఏర్పడే పరిస్థితులు నెల‌కొనే ప్ర‌మాదం పొంచి ఉంద‌న్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే స్పందించి, మోటార్లు ఆన్ చేసి, నీళ్లను ఎత్తిపోయకపోతే.. 50 వేల మందితో ముట్టడించి కన్నెపల్లి పంపులను ఆన్‌ చేస్తాం అని హెచ్చ‌రించారు.

Leave A Reply

Your Email Id will not be published!