తిరుమల : తిరుమల శ్రీవారిని దర్శించుకునే భక్తులకు కోలుకోలేని షాక్ తగిలింది. ఉత్సవాలతో పాటు భారీ ఎత్తున భక్త బాంధవులు తరలి వస్తుండడంతో దర్శన భాగ్యం అనేది సామాన్యులకు అందకుండా పోతోందన్న ఆందోళన నెలకొంది. దీంతో వీఐపీ బ్రేక్ దర్శనంకు సంబంధించి సంచలన ప్రకటన చేసింది టీటీడీ. ఈ మేరకు అధికారికంగా వెల్లడించింది. జూలై 14 , 17 తేదీలలో వీఐపీ బ్రేక్ దర్శనాన్ని టీటీడీ రద్దు చేసినట్లు వెల్లడించారు ఈవో ముద్దాడ రవిచంద్ర. ‘కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం’ (జూలై 14న) , ‘అనివార ఆస్థానం’ (జూలై 17న) కార్యక్రమాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. అనివార ఆస్థానం వేడుకల కారణంగా జూలై 17న కల్యాణోత్సవం, ఆర్జిత బ్రహ్మోత్సవం, ఊంజల్ సేవ ,సహస్ర దీపాలంకరణ సేవలు కూడా రద్దు చేయడం జరిగిందన్నారు.
ఆలయ సంప్రదాయ కార్యక్రమాలను సజావుగా నిర్వహించడానికి మరియు భక్తులకు మెరుగైన దర్శన సౌకర్యం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈవో తెలిపారు. అలాగే, జూలై 13, 16 తేదీలలో వీఐపీ దర్శన సిఫార్సు లేఖలను స్వీకరించబోమని కూడా టీటీడీ ప్రకటించింది. తిరుమల సందర్శనను ప్లాన్ చేసుకుంటున్న భక్తులు తదనుగుణంగా తమ ప్రయాణాన్ని ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. టీటీడీ సమాచారం ప్రకారం, సర్వ దర్శనం కోసం వేచి ఉండే సమయం సుమారు 18–20 గంటలు ఉండవచ్చని అంచనా. రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3–5 గంటల సమయం పట్టవచ్చని, సర్వ దర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు 4–6 గంటల వేచి ఉండే సమయం ఉండవచ్చని అంచనా .
