తిరుమల : టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుమల పుణ్యక్షేత్రాన్ని దర్శించుకునే భక్తులకు కీలక సూచనలు చేసింది. తిరుమలలో శ్రీవారి దర్శనాలు, వసతి ఇప్పిస్తామంటూ ఇటీవల భక్తులను కొందరు దళారులు మోసం చేస్తున్న సంఘటనలు చోటు చేసుకోవడంతో మధ్యవర్తులు, దళారుల మాటలు నమ్మవద్దని మరోమారు టీటీడీ భక్తులకు విజ్ఞప్తి చేసింది. శ్రీవారి దర్శనాలు, తిరుమలలో వసతికి సంబంధించి భక్తులను మోసం చేస్తున్న దళారులపై టీటీడీ ప్రత్యేక దృష్టి పెట్టిందని తెలిపింది. తమ దృష్టికి వస్తే వెంటనే టీటీడీ విజిలెన్స్ విభాగానికి తెలియ చేయాలని , కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని స్పష్టం చేసింది.
అయినప్పటికీ మోసపూరితమైన మాటలతో భక్తులను నమ్మించి డబ్బులు తీసుకుని ఉడాయించే సంఘటనలు చోటు చేసుకుంటున్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఎవరైనా దర్శనాలు, వసతి పేరుతో సంప్రదిస్తే వెంటనే టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ : 155257 కు ఫిర్యాదు చేయాల్సిందిగా భక్తులను కోరింది. శ్రీ వేంకటేశ్వర స్వామిపై ఎంతో విశ్వాసం ఉంచి స్వామివారి దర్శనం కోసం పరితపించే భక్తుల బలహీనతను ఆసరాగా చేసుకుని మోసం చేస్తున్న వారు ఎంతటి వారైనా సరే వారి పట్ల టీటీడీ కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించింది.
ఇటీవల కొందరు దళారులు మోసం చేసిన విషయం తమ దృష్టికి వచ్చిందని, వారిపై కేసు నమోదు చేసి పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపింది తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ముఖ్య కార్య నిర్వహణ అధికారి ముద్దాడ రవిచంద్ర. తిరుమలకు సంబంధించి ఏదేని సమాచారం కావాలన్నా టీటీడీకి సంబంధించి అధికారిక వెబ్ సైట్ , యాప్ , టోల్ ఫ్రీలను సంప్రదించాలని కోరారు.
