హైదరాబాద్: వినియోగదారులకు విద్యుత్ సేవలను ఎలాంటి జాప్యం, అసౌకర్యం లేకుండా పారదర్శకంగా, వేగవంతంగా అందించడం ప్రతి అధికారి ప్రధాన బాధ్యత అని టీజీఎస్పీడీసీఎల్ చైర్మన్ ,మేనేజింగ్ డైరెక్టర్ జితేష్ వి. పాటిల్ పేర్కొన్నారు. టీజీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో సీపీటీఐ, యూసుఫ్‌గూడలో యూనిఫాం సర్వీస్ లైన్ చార్జెస్ అమలుపై ప్రత్యేక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా టీజీఎస్పీడీసీఎల్ పరిధిలోని 21 ఆపరేషన్ సర్కిళ్ల సూపరింటెండింగ్ ఇంజనీర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎండీ జితేష్ వి. పాటిల్ మాట్లాడారు. ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణల ప్రధాన లక్ష్యం వినియోగదారులకు నాణ్యమైన, పారదర్శకమైన, సమయానుకూల విద్యుత్ సేవలు అందించడమేనని పేర్కొన్నారు. ప్రతి దరఖాస్తును నిబంధనలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పరిష్కరించాలని ఆదేశించారు. వినియోగదారులు తమ సమస్యల పరిష్కారం కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి రాకుండా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.
యూనిఫాం సర్వీస్ లైన్ చార్జెస్ (USLC) అమలుతో కొత్త విద్యుత్ కనెక్షన్ల మంజూరు ప్రక్రియ మరింత సరళతరం, పారదర్శకంగా మారుతుందని సీఎండీ తెలిపారు. ఈ విధానాన్ని క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా అమలు చేసి, ప్రతి వినియోగదారునికి ఒకే విధమైన, నాణ్యమైన సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. వినియోగదారుల సమస్యలను సకాలంలో పరిష్కరించడం, ఫిర్యాదులపై వెంటనే స్పందించడం, ప్రజల విశ్వాసాన్ని మరింత పెంపొందించేలా సేవలు అందించడం ప్రతి అధికారి బాధ్యత అని ఆయన పేర్కొన్నారు. ప్రజా సేవే లక్ష్యంగా పనిచేస్తూ టీజీఎస్పీడీసీఎల్ ప్రతిష్ఠను మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలని అధికారులకు పిలుపునిచ్చారు.
