తిరుపతి : తిరుపతి లోని ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీ కోదండ రామస్వామి వారి ఆలయంలో జరుగుతున్న పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు ఆదివారం పవిత్ర సమర్పణ కార్యక్రమం శాస్త్రోక్తంగా, భక్తిశ్రద్ధలతో వైభవంగా జరిగింది. ఉదయం స్వామి వారిని సుప్రభాతంతో మేల్కొలిపి తోమాలసేవ, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం సీతాలక్ష్మణ సమేత శ్రీరాముల వారి ఉత్సవ మూర్తులను యాగశాలకు వేంచేపు చేసి విష్వక్సే నారాధన, పుణ్యా హవచనం, కుంభారాధన, ఉక్తహోమాలు నిర్వహించారు.
సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండ రామస్వామి వారి ఉత్సవ మూర్తులకు స్నపన తిరుమంజనం కన్నుల పండువగా జరిగింది. పాలు, పెరుగు, తేనె, చందనం, కొబ్బరినీటితో స్వామి వారికి అభిషేకం చేశారు.యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి తీసుకు వచ్చారు. ధ్రువ మూర్తులు, కౌతుక మూర్తులు, స్నపన మూర్తులు, బలి మూర్తులకు పవిత్రాలు సమర్పించారు. అలాగే విష్వక్సేనుడు, ద్వార పాలకులు, భాష్యకారులు, గరుడాళ్వార్, హోమ గుండాలు, బలిపీఠం, ధ్వజస్తంభం, ఆలయం ఎదురుగా ఉన్న శ్రీ ఆంజనేయ స్వామివారికి పవిత్రాలు సమర్పించారు.
సాయంత్రం శ్రీ సీతారామ లక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనం ఇచ్చారు భక్త బాంధవులకు. అనంతరం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహించారు. ఇదిలా ఉండగా ఆగస్టు 10న సోమవారం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో బి. నాగరత్న, ఆలయ ప్రధాన అర్చకులు ఆనంద్ కుమార్ దీక్షితులు, సూపరింటెండెంట్ కె. శ్రీనివాసులు రెడ్డి, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు సురేష్, హరికృష్ణ, ఆలయ అర్చకులు, శ్రీవారి సేవకులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
