ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై కోర్టు స్టే

ప్రైవేట్ కాలేజీల‌కు భారీ ఊర‌ట‌నిచ్చిన తీర్పు

హైద‌రాబాద్ : ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై GO నం. 9లోని కీలక నిబంధనలపై హైకోర్టు స్టే విధించింది. ఈ తీర్పుతో ప్రైవేట్ కళాశాలలకు భారీ ఊరట ల‌భించింది. ఇదే క్ర‌మంలో బకాయిల చెల్లింపు గడువు వివరాలను కోరింది న్యాయస్థానం. ఆగస్టు 15 నాటికి బకాయిలు చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇవాళ విచార‌ణ చేప‌ట్టిన కోర్టు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలకు ఊరటనిస్తూ, తెలంగాణ హైకోర్టు GO నం. 9లోని కొన్ని నిబంధనలపై జూన్ 30 (మంగళవారం) వరకు స్టే విధించింది. విచారణ సందర్భంగా, కళాశాలలకు ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులో జాప్యంపై న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. పెండింగ్‌లో ఉన్న బకాయిలను విడుదల చేయకుండా విద్యా సంస్థలు ఎలా పని చేయగలవని ప్రశ్నించింది కోర్టు,

రీయింబర్స్‌మెంట్ కోసం కేటాయించిన బడ్జెట్, బకాయిల చెల్లింపు గడువు వివరాలను కోరింది. ప్రభుత్వం తరపు న్యాయవాది మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నింటినీ ఆగస్టు 15 లోపు చెల్లిస్తామని కోర్టుకు తెలిపారు. ఈ హామీపై స్పందిస్తూ, ప్రైవేట్ కళాశాలల తరపు న్యాయవాది మాట్లాడుతూ, హామీ ఇచ్చినట్లుగా బకాయిలు చెల్లిస్తే పిటిషన్లను ఉప సంహరించు కుంటామని పేర్కొన్నారు. విద్యార్థుల తరపున కూడా ఒక ‘ఇంప్లీడ్ పిటిషన్’ (కేసులో భాగస్వామ్యం కోరే పిటిషన్) దాఖలైంది. తాము కళాశాల యాజమాన్యాలు , ప్రభుత్వం మధ్య నలిగి పోతున్నామని విద్యార్థుల తరపు న్యాయవాది వాదించారు.

అలాగే రీయింబర్స్‌మెంట్ బకాయిల కారణంగా విద్యార్థులు ఇబ్బంది పడకుండా చూడాలని కోర్టును కోరారు. తదుపరి విచారణలో అడ్వకేట్ జనరల్ సమగ్ర వాదనలు వినిపిస్తారని ప్రభుత్వ న్యాయవాది తెలిపారు. అనంతరం కోర్టు ఈ కేసు విచారణను జూన్ 30కి వాయిదా వేసింది.

Leave A Reply

Your Email Id will not be published!