పవన్ కళ్యాణ్ కు రుణపడి ఉంటా : లింగమనేని రమేష్
రాజ్యసభ సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేసిన ఎంపీ
న్యూఢిల్లీ : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కీలక వ్యాఖ్యలు చేశారు ఎంపీ లింగమనేని రమేష్. గురువారం ఆయన జనసేన పార్టీ తరపున ఎంపీగా ఎన్నికయ్యారు. ఈ సందర్బంగా రాజ్యసభలో ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు లింగమనేని రమేష్. భారత అత్యున్నత సభ అయిన రాజ్యసభలో అడుగుపెట్టే గొప్ప అవకాశాన్ని, నాపై నమ్మకంతో అప్పగించిన జనసేన అధ్యక్షులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియ చేసుకుంటున్నానని తెలిపారు. ఈ ప్రయాణంలో సహకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, కూటమి నాయకత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
రాజ్యసభ సభ్యత్వాన్ని నేను ఒక అధికార హోదాగా కాకుండా, ఐదు కోట్ల ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల నాకు దక్కిన అత్యున్నత బాధ్యతగా భావిస్తున్నానని అన్నారు లింగమనేని రమేష్. నేను ఢిల్లీకి ఒక వ్యక్తిగా కాకుండా జనసేన పార్టీ ఆశయాలకు ప్రతినిధిగా వచ్చానని చెప్పారు. ఇటీవల ఢిల్లీలో జరిగిన జనసేన ప్రతినిధుల సమావేశంలో మా అధినేత పార్లమెంట్‌లో మా ప్రవర్తన, బాధ్యతలపై స్పష్టమైన దశా-దిశా నిర్దేశం చేశారని చెప్పారు. పవన్ కళ్యాణ్ చెప్పిన విలువలతో కూడిన రాజకీయాలనే నా ప్రయాణానికి దిక్సూచిగా మార్చుకుంటానని అన్నారు పార్లమెంట్ సభ్యులు అంటే కేవలం ఒక రాష్ట్రానికే పరిమితం కాదని, యావత్ దేశ ప్రయోజనాల కోసం అంకిత భావంతో పని చేయాలని మా నాయకుడు మాకు స్పష్టం చేశారన్నారు.
