హైదరాబాద్ : తెలంగాణ సర్కార్ విద్యార్థులకు తీపి కబురు చెప్పింది. ఇకపై ప్రతి ఏటా ఫీజు రీయింబర్స్‌మెంట్ నిధులను విద్యార్థుల ఖాతాల్లో ముందస్తుగానే జమ చేస్తామని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం విద్యార్థులు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండానే, ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారి ఖాతాల్లో ఈ డబ్బును ముందస్తుగా జమ చేస్తామని వెల్లడించారు.నెక్లెస్ రోడ్ సమీపంలోని హెచ్‌ఎండీ గ్రౌండ్స్ ఎదురుగా ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే , సావిత్రిబాయి పూలే విగ్రహాలను ముఖ్యమంత్రి ఆవిష్కరించి, ఆ మహనీయులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ఫీజులు చెల్లించ లేదన్న కారణంతో కళాశాలలు సర్టిఫికెట్లను నిలిపి వేయకూడదని అన్నారు. విద్యార్థులు అడగక పోయినా సరే, తాము వారి ఖాతాల్లో డబ్బును జమ చేస్తామని ప్రకటించారు సభ సాక్షిగా.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌కు సంబంధించి ఈ విద్యా సంవత్సరం నుండే బ్యాంకు ఖాతాల్లో నిధులను ముందస్తుగా జమ చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు సీఎం. ఈ విధానాన్ని మరింత పారదర్శకంగా అమలు చేయడానికి, ప్రతి ఏటా విద్యార్థుల ఖాతాల్లో ₹2,400 కోట్లు జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని స్పష్టం చేశారు. మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించు కోవాలని ఆయన సూచించారు. గతంలో ఇంజనీరింగ్ లేదా మెడికల్ డిగ్రీ సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు. నైపుణ్యాలు ఉన్నవారికి మాత్రమే ఉద్యోగాలు లభిస్తాయి. అందుకే నర్సరీ నుండి 12వ తరగతి వరకు విద్యతో పాటు నైపుణ్య శిక్షణను కూడా అందించాలన్నారు. సాంకేతిక నైపుణ్యం ఉన్నవారికి సమాజం సాదర స్వాగతం పలుకుతుందని చెప్పారు. కేవలం సర్టిఫికెట్ ఉంటే ఉద్యోగం వస్తుందా లేదా అనేది చెప్పలేమన్నారు.
ప్రస్తుతం విద్యారంగంలో పోటీ పెరిగిందని, చాలా మంది 90% కంటే ఎక్కువ మార్కులు సాధిస్తున్నారు. ఇది కేవలం చదువుకు మాత్రమే పరిమితం కాదు. కొందరు సాంకేతిక నైపుణ్యాలలో రాణిస్తుంటే, మరికొందరు క్రీడలలో అద్భుతాలు సృష్టిస్తున్నారని అన్నారు సీఎం. వారిలో ఇంకా వెలికిరాని అద్భుతమైన ప్రతిభ దాగి ఉందన్నారు. బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్, సిరాజ్ , దీప్తి దివాన్షి వంటి వారిని ఉదాహరణగా చూపుతూ ‘యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ’ ద్వారా క్రీడలలో రాణించే వారికి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు కోటి రూపాయల నగదు బహుమతిని కూడా అందిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు.
