హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజా రంజక పాలన సాగిస్తున్నామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. భారత స్వాతంత్రం కోసం సర్వస్వాన్ని త్యాగం చేసిన మహనీయులు జాతిపిత మహాత్మాగాంధీ, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, నవభారత నిర్మాణానికి పునాదులు వేసిన పండిట్ జవహర్లాల్ నెహ్రూ, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు అర్పించిన అమరులకు ఘనంగా నివాళులు అర్పిస్తున్నానని అన్నారు. పేదవాడికి ఆకలి నుంచి విముక్తి, రైతుకు అప్పుల నుంచి విముక్తి, మహిళకు ఆర్థిక స్వేచ్ఛ, యువతకు ఉపాధి, బలహీన వర్గాలకు సమాన అవకాశాలు కల్పించినప్పుడే స్వాతంత్రానికి నిజమైన అర్థం అని పేర్కొన్నారు. స్వేచ్ఛ లభించిన తర్వాత వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, వైద్యం, విజ్ఞానం, సాంకేతిక రంగాలకు వేసిన పునాదుల స్ఫూర్తితో తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలన సాగుతోందన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సామాజిక న్యాయం ప్రధాన లక్ష్యాలుగా పని చేస్తున్నామని చెప్పారు సీఎం .రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం అధికారం చేపట్టి 32 నెలలు పూర్తయింది. దెబ్బతిన్న వ్యవస్థలను గాడిలో పెట్టిన మా ప్రభుత్వం సంక్షేమాన్ని విస్తరించింది. అభివృద్ధికి కొత్త దిశను నిర్దేశించిందన్నారు. తెలంగాణ భవిష్యత్తుకు అవసరమైన విధానాలు, చట్టాలు, భారీ ప్రాజెక్టులు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలకు బలమైన పునాదులు వేసిందన్నారు. రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపించే కార్యక్రమాలు తలపెట్టిందని చెప్పారు.
తెలంగాణ పునర్నిర్మాణానికి కొత్త బాటలు వేసిందన్నారు. అన్ని రంగాల అభివృద్ధి, అన్ని వర్గాల సంక్షేమం, భవిష్యత్తు తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసే సరికొత్త ప్రజాపాలనకు శ్రీకారం చుట్టిందన్నారు.32 నెలల ప్రజాపాలన ఫలితాలు రాష్ట్ర ఆర్థిక ప్రగతిలో స్పష్టంగా కనిపిస్తున్నాయని అన్నారు సీఎం. 2025-26లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.4,18,931. దేశ తలసరి ఆదాయంతో పోలిస్తే తెలంగాణ తలసరి ఆదాయం దాదాపు 91 శాతం అధికంగా ఉందన్నారు. రైతు బాగుంటేనే మనం బాగుంటామని ప్రభుత్వం భావిస్తోందన్నారు. రైతులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. రూ.2 లక్షల వరకు పంట రుణాల మాఫీ. 25 లక్షల కుటుంబాలకు రుణభారం నుంచి విముక్తి కల్పించామన్నారు. మన రైతులు దేశానికే ఆదర్శంగా నిలిచారన్నారు. వరి సాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో పంజాబ్‌ను అధిగమించి దేశంలో నంబర్–1గా ఉండేలా కృషి చేశామన్నారు సీఎం. యాసంగిలో 81.12 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి కొత్త రికార్డు సృష్టించాం అన్నారు. రైతు భరోసా కింద రూ.36 వేల కోట్ల పెట్టుబడి సాయం. 9 రోజుల్లో 9 వేల కోట్లు. సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ ఇచ్చి అండగా నిలబడ్డాం..32 నెలల్లో వ్యవసాయం, రైతు సంక్షేమానికి రూ.1.70 లక్షల కోట్లు కేటాయించామన్నారు . కృష్ణా, గోదావరి జలాల్లో న్యాయమైన వాటాలో రాజీ పడేది లేదన్నారు సీఎం. తుమ్మిడి హట్టి నుంచి పాలమూరు వరకు పెండింగ్ ప్రాజెక్టులను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తాం అన్నారు.
వ్యవసాయం దండుగ అనే పరిస్థితి నుంచి వ్యవసాయాన్ని పండుగ చేసి రైతుల కళ్లల్లో ఆనందాన్ని చూసేలా పని చేస్తున్నామని చెప్పారు. కోటీ మంది మహిళలకు కోటీశ్వరులను చేయడమే ధ్యేయంగా ముందుకు వెళ్తున్నాం అన్నారు. మహాలక్ష్మి పథకం ద్వారా ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రవేశ పెట్టామన్నారు. 335 కోట్ల జీరో టికెట్లతో రికార్డు సృష్టించామని తెలిపారు. 34 లక్షల మంది మహిళలు ప్రతి రోజు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం చేస్తున్నారని చెప్పారు. మహిళలకు దాదాపు రూ.11 వేల కోట్ల మేర ఆదా అయ్యిందన్నారు. గృహజ్యోతి కింద 53 లక్షల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు ఇస్తున్నామన్నారు. 43 లక్షల కుటుంబాలకు రూ.500కే గ్యాస్ సిలిండర్ అందుతోందన్నారు. 1.68 లక్షల మందికి కళ్యాణ లక్ష్మీ, షాదీ ముబారక్ ద్వారా 4,709 కోట్లు అందించాం అని తెలిపారు. మహిళా సంఘాలకు రూ.60,487 కోట్ల రుణాలు. రూ.1,900 కోట్ల వడ్డీ రాయితీ ఇచ్చామన్నారు. ఉత్పత్తులు అమ్ముకోవడానికి శిల్పారామం వద్ద స్టాల్స్ ఏర్పాటు చేశాం అని తెలిపారు సీఎం.యూనిఫాంలు, చీరల తయారీ నుంచి పెట్రోలు బంకులు, ఆర్టీసీ బస్సుల యాజమాన్యం వరకు మహిళా సంఘాల వ్యాపార విస్తరణకు శ్రీకారం చుట్టామన్నారు. తెలంగాణ మహిళలు దేశంలోనే పారిశ్రామిక వేత్తలు గా మారాలన్నది మా ప్రభుత్వం ఆకాంక్ష అని ప్రకటించారు.