మేధో ప‌ర‌మైన న‌క్స‌ల్స్ ను ఏరి పారేయాలి

పిలుపునిచ్చిన ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ

న్యూఢిల్లీ : ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు జాతిని ఉద్దేశించి. దేశ రాజ‌ధాని న్యూఢిల్లీలోని ఎర్ర‌కోట సాక్షిగా ఆయ‌న 80వ స్వాతంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా శ‌నివారం జెండాను ఎగుర వేశారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మేధోపరమైన నక్సల్స్ ను గుర్తించాల‌ని, వారిని ఏకాకిని చేయాల‌ని పిలుపునిచ్చారు. దేశంలో మావోయిస్ట్ తీవ్రవాదం అంతిమ దశకు చేరుకుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. మేధో న‌క్స‌ల్స్ ను సమాజం నుండి వేరు చేయాలని పిలుపునిచ్చారు. నక్సలిజం , మావోయిజం అనేక మంది యువకుల భవిష్యత్తును నాశనం చేశాయని ప్రధాని పేర్కొన్నారు. నాలుగు దశాబ్దాల పాటు, తుపాకుల భయంతో భారీ ప్రాంతాలు , ప్రజలు వారి గుప్పిట్లో ఉన్నారని అన్నారు. ప్రజలను రక్షించే క్రమంలో 3,500 మందికి పైగా భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారని వాపోయారు పీఎం.

యుద్ధంలో మరణించే వారి సంఖ్య కంటే ఇది ఎక్కువ అని ఆయన అన్నారు. 2014లో మేము అధికారంలోకి వచ్చినప్పుడు, దేశాన్ని నక్సల్స్ నుండి విముక్తి చేస్తామని ప్రతిజ్ఞ చేశామని గుర్తు చేశారు. మావోయిస్ట్ హింస అంతిమ దశకు చేరుకోవడం నాకు సంతోషాన్నిస్తోంది న‌రేంద్ర దామోద‌ర్ దాస్ మోదీ అన్నారు. అనేక ప్రాంతాలు నక్సలైట్ల నుండి విముక్తి పొంది అభివృద్ధి చెందుతున్నాయని ఆయన తెలిపారు. మోదీ ఇంకా ఇలా అన్నారు ఏళ్ల తరబడి, నక్సల్ భావజాలం ఉన్నవారికి అధికార కేంద్రాలలో స్థానం ఉండేది. వారు ప్రభుత్వ కమిటీలలో సలహాదారులుగా ఉండేవారు. మావోయిస్ట్ ఆలోచనా విధానం విధానాలపై ప్రభావం చూపేది. అడవుల్లో సంచరించే సాయుధ నక్సల్స్‌ను తొలగించడంలో మేము విజయం సాధించామ‌న్నారు. కానీ మేధోపరమైన నక్సల్స్ హింసను, అశాంతిని సృష్టించడానికి అవకాశాల కోసం చూస్తున్నారని ఆరోపించారు మోదీ. . వారు సమాజాన్ని తప్పుదారి పట్టించాలని కోరుకుంటున్నారని మండిప‌డ్డారు.

Leave A Reply

Your Email Id will not be published!