తిరుపతి : తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వార్షిక తెప్పోత్సవాలు జూన్ 25 నుండి 29వ తేదీ వరకు ఐదు రోజులపాటు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ప్రతిరోజూ సాయంత్రం 6.30 గంటల నుండి రాత్రి 7.30 గంటల వరకు పద్మ సరోవరంలో సుందరంగా అలంకరించిన తెప్పలపై విహరిస్తూ శ్రీ పద్మావతి అమ్మవారు భక్తులకు దివ్య దర్శనం ఇవ్వనున్నారు. జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి నుండి పౌర్ణమి వరకు జరిగే ఈ పవిత్ర తెప్పోత్సవాల్లో పాల్గొని అమ్మ వారిని దర్శించుకుంటే భక్తుల కష్టాలు తొలగి, దైవానుగ్రహంతో సుఖశాంతులు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
పద్మ సరోవరంలోని బంగారు పద్మం నుండి అవతరించిన శ్రీ పద్మావతి అమ్మవారు జగజ్జననిగా భక్తులను అన్ని కష్టాల నుండి కాపాడి, సుఖశాంతులు ప్రసాదిస్తారనే ఆధ్యాత్మిక సందేశాన్ని తెప్పోత్సవాలు తెలియ జేస్తాయి. పద్మస రోవరంలో అమ్మ వారి తెప్ప విహారం దర్శించు కోవడం భక్తులకు అపూర్వమైన దివ్యానుభూతిని కలిగిస్తుంది. 25న రుక్మిణి, సత్యభామ సమేత శ్రీకృష్ణస్వామివారి తెప్పోత్సవం – 3 ప్రదక్షిణలు, 26న శ్రీ సుందర రాజ స్వామి వారి తెప్పోత్సవం – 3 ప్రదక్షిణలు, 27 నుండి 29 వరకు: శ్రీ పద్మావతి అమ్మవారి తెప్పోత్సవం జరుగుతుందని తెలిపింది టీటీడీ.
ఉత్సవాల చివరి మూడు రోజులైన జూన్ 27, 28, 29 తేదీలలో పద్మసరోవరంలోని నీరాడ మండపంలో మధ్యాహ్నం 3 గంటల నుండి సాయంత్రం 4.30 గంటల వరకు అమ్మ వారికి తిరుమంజనం ఘనంగా నిర్వహించనున్నారు. జూన్ 28వ తేదీ రాత్రి 8.30 గంటలకు గజవాహన సేవ, జూన్ 29వ తేదీ రాత్రి 8.30 గంటలకు గరుడ వాహన సేవ వైభవోపేతంగా జరుగనున్నాయి. తెప్పోత్సవం అనంతరం ప్రతిరోజూ ఆలయ మాడ వీధుల్లో అమ్మవారి ఉత్సవ మూర్తుల ఊరేగింపు నిర్వహించనున్నారు. తెప్పోత్సవాల సందర్భంగా ఐదు రోజుల పాటు నిర్వహించే కల్యాణోత్సవం, ఊంజల్‌సేవలను, అలాగే జూన్ 26న నిర్వహించే లక్ష్మీపూజ కూడా టిటిడి రద్దు చేసింది.
