ప్రజలు అమరావతి అంటే వైఎస్ఆర్సీపీ మావిగన్ అంటోంది
రూ.118 కోట్లతో మోడల్ బస్ స్టేషన్, డిపోకు సీఎం శంకుస్థాపన
చిత్తూరు జిల్లా : ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన వైసీపీని , మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని ఏకి పారేశారు. స్వర్ణ కుప్పం లక్ష్యంగా నియోజకవర్గాన్ని అభివృద్ధి కేంద్రంగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి ప్రకటించారు. కుప్పంలో రూ.118 కోట్లతో నిర్మించనున్న ఆధునిక ఆర్టీసీ బస్ స్టేషన్, డిపోకు శంకుస్థాపన చేశారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం ప్రసంగించారు. అభివృద్ధి అంశాలతో పాటు గత ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. వివేకానందరెడ్డి హత్య నుంచి కోడికత్తి ఘటన, డాక్టర్ సుధాకర్, డ్రైవర్ సుబ్రహ్మణ్యం, అమరావతి రాజధాని, కుప్పం అభివృద్ధి వరకు గత ప్రభుత్వంలో జరిగిన విధానాలను ఎండగట్టారు.
ఎన్టీఆర్ హయాంలో కుప్పంలో బస్ స్టేషన్కు శంకుస్థాపన జరిగిందని, ఇప్పుడు అత్యాధునిక మోడల్ బస్ స్టేషన్, డిపో నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని చంద్రబాబు తెలిపారు. డిపోలో సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేసి సౌర విద్యుత్ వినియోగాన్ని ప్రోత్సహిస్తామని చెప్పారు. కుప్పాన్ని స్వర్ణ కుప్పంగా తీర్చిదిద్దే దిశగా పరిశ్రమలు తీసుకొస్తున్నామని, ఉద్యోగాల కోసం కుప్పం ప్రజలు బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఇతర ప్రాంతాల వారు కుప్పానికి వచ్చే పరిస్థితి కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. ఒక్క రోజులోనే రూ.9,322 కోట్ల పెట్టుబడులతో 30 ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఎంఓయూలు జరిగాయని చెప్పారు. వాటి ద్వారా సుమారు 80 వేల మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి లభిస్తుందని వివరించారు. అడిడాస్ ఫుట్వేర్ సంస్థ కోసం అనేక రాష్ట్రాలు పోటీ పడినా అది కుప్పాన్నే ఎంచుకుందని చెప్పారు. టూ సీటర్ ట్రైనీ ఎయిర్క్రాఫ్ట్ తయారీ పరిశ్రమతో పాటు డెయిరీ, ఫుడ్ ప్రాసెసింగ్, పౌల్ట్రీ పరిశ్రమలు కూడా కుప్పానికి వచ్చాయని వెల్లడించారు చంద్రబాబు నాయుడు.
