ఉత్తర ప్రదేశ్ : దేశ వ్యాప్తంగా ఉత్తర ప్రదేశ్ లోని అయోధ్య రామాలయం నిర్మాణ విషయంలో చోటు చేసుకున్న విరాళాలు పక్కదారి పట్టాయని పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. ఇదే అంశానికి సంబంధించి భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేయడం, దీనిపై విచారణ కోసం యూపీ యోగి సర్కార్ విచారణకు ఆదేశించారు. ఈ మేరకు సిట్ ను ఏర్పాటు చేశారు. ఈ విరాళాల సేకరణ లో అక్రమాలు చోటు చేసుకున్నట్లు గుర్తించింది దర్యాప్తు సంస్థ. ఎఫ్ ఐ ఆర్ కూడా నమోదు చేశారు. ఇందులో ఎనిమిది మంది కీలకమైన పాత్ర పోషించినట్లు తేలింది. ఇదిలా ఉండగా శుక్రవారం సంచలన ప్రకటన చేశారు పోలీసులు.
ఈ కేసులో కీలకమైన నిందితులుగా ఉన్న ఎనిమిది మందిని అరెస్ట్ చేశారు. వీరు ఆలయానికి వచ్చిన నగదు, విలువైన వస్తువులను లెక్కించే ప్రక్రియలో పాలు పంచుకున్నారని తెలిపారు. అయోధ్యలోని రామ మందిరానికి సంబంధించి వచ్చిన విరాళాలను దుర్వినియోగం చేశారన్న ఆరోపణలపై నమోదైన వారిని గుర్తించి అరెస్ట్ చేశామన్నారు. ‘శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్’ సభ్యుడు కృష్ణ మోహన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ ఆరోపణలపై విచారణ జరిపేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ సమర్పించిన ప్రాథమిక నివేదికలోని సిఫార్సుల ఆధారంగా ఈ చర్య తీసుకున్నారు.
కాగా అరెస్ట్ చేసిన వారిని విచారణలో భాగంగా వారిని ప్రశ్నిస్తున్నామని తెలిపారు. వీరు ఆలయానికి విరాళంగా వచ్చిన నగదు, విలువైన వస్తువులను లెక్కించే పనిలో నిమగ్నమై ఉండేవారు. నిందితులందరూ అయోధ్యలోనే ఉన్నారు. నిన్న అర్ధరాత్రి వారిని అరెస్టు చేశామన్నారు. తదుపరి విచారణ కొనసాగుతోంది. వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచేందుకు పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు అని ఒక ఉన్నతాధికారి తెలిపారు.
