వీఐపీ బ్రేక్, శ్రీవాణి దర్శన కరెంట్ బుకింగ్ టికెట్ల కోటా రద్దు
సాధారణ భక్తులకు త్వరితగతిన దర్శనం కల్పించేందుకు చర్యలు
తిరుమల : తిరుమలలో శనివారం అనూహ్యంగా భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్న నేపథ్యంలో సాధారణ భక్తులకు వీలైనంత త్వరగా శ్రీవారి దర్శనం కల్పించడంతో పాటు వారి భద్రత, సౌకర్యాలకు అత్యున్నత ప్రాధాన్యం ఇస్తూ టీటీడీ యంత్రాంగం నిరంతరం సేవలందిస్తోందని టీటీడీ అదనపు ఈవో సి.హెచ్. వెంకయ్య చౌదరి తెలిపారు. ఆయన పాచికాల్వ గంగమ్మ గుడి సర్కిల్ వద్ద క్యూ లైన్లను పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, తిరుమలలో సాధారణ రోజుల్లో సైతం రోజుకు సగటున 85 వేల నుంచి 87 వేల మంది భక్తులకు శ్రీవారి దర్శనం కల్పిస్తున్నామని, ఇందుకోసం టీటీడీ అధికారులు, ఉద్యోగులు, విజిలెన్స్, పోలీసులు, అన్నప్రసాద విభాగం, పారిశుద్ధ్య సిబ్బంది తదితరులు రాత్రింబవళ్లు కృషి చేస్తున్నారని తెలిపారు.
అయితే శనివారం తిరుమల చరిత్రలోనే అరుదుగా కనిపించే స్థాయిలో లక్షన్నర మందికి పైగా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్న పరిస్థితి ఏర్పడిందని చెప్పారు. ఇంత భారీ సంఖ్యలో భక్తులు ఒకేసారి రావడంతో అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేస్తూ, భక్తులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తూ, క్యూ లైన్లలో ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు.ఆదివారం కూడా భారీగా భక్తులు వచ్చే అవకాశం ఉన్నందున పరిస్థితిని పూర్తిస్థాయిలో అదుపులో ఉంచేందుకు ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నామని తెలిపారు. ఇందులో భాగంగా అధికారులు, సిబ్బంది సెలవులను రద్దు చేసి అందరినీ తిరుమలలోనే విధుల్లో కొనసాగిస్తున్నామని, అదనపు పోలీసు బలగాలను కూడా మోహరించినట్లు పేర్కొన్నారు.
సాధారణ భక్తులకు ఎక్కువ సమయం కేటాయించేందుకు సోమవారం వీఐపీ బ్రేక్ దర్శనాలు, ఆన్ లైన్ లో ఏరోజుకారోజు కరెంట్ బుకింగ్ లో జారీ చేసే 800 శ్రీవాణి దర్శన టికెట్ల కోటాను రద్దు చేసినట్లు అదనపు ఈవో తెలిపారు. అలాగే ఎస్ఎస్డీ తదితర దర్శనాల కోటాలను కూడా అవసరానికి అనుగుణంగా తగ్గించి, ఆ సమయాన్ని సర్వదర్శనం భక్తులకు వినియోగిస్తున్నామని వివరించారు.తిరుమలలోని అన్ని యాత్రికుల వసతి సముదాయాలు, క్యూ లైన్లు పూర్తిగా నిండి పోయినప్పటికీ పారిశుద్ధ్యం, తాగునీరు, అన్నప్రసాదం, ఇతర మౌలిక సేవలను నిరంతరాయంగా అందిస్తున్నామని తెలిపారు. భక్తులు టీటీడీకి సహకరించాలని అదనపు ఈవో విజ్ఞప్తి చేశారు. దర్శనం సమయంలో అనవసరంగా ఎక్కువసేపు గర్భగుడి వద్ద నిల్చోకుండా, వెనుక వేచి ఉన్న భక్తులను దృష్టిలో ఉంచుకొని త్వరితగతిన దర్శనం పూర్తి చేసుకోవాలని కోరారు.
