అమరావతి : జగన్ రెడ్డిపై, ఆయన అనుచరులైన మంత్రులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి అచ్చెన్నాయుడు. అమరావతి విషయంలో రాష్ట్ర ప్రజలను, రైతులను మోసం చేసిన వైసీపీ నాయకులు ఇప్పుడు మళ్లీ రైతుల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని విమర్శించారు. అమరావతి రాజధానిని ఐదేళ్ల పాటు నిర్వీర్యం చేసి, వేలాది మంది రైతుల జీవితాలతో చెలగాటమాడిన వారే ఇప్పుడు ‘అమరావతి రైతు పరిరక్షణ’ పేరుతో కొత్త నాటకాలు ఆడటం సిగ్గుచేటు అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని పేర్కొన్నారు. అందుకే వైసీపీ నాయకులు ఎక్కడికి వెళ్లినా తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నారని అన్నారు. రాజకీయాల కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తూ, ప్రజల సహనాన్ని పరీక్షిస్తే ప్రజల నుంచి తీవ్ర ప్రతిస్పందనే వస్తుందన్నారు. ప్రజలను రెచ్చగొట్టి ఆ తర్వాత బాధితులమని నటించడం వైసీపీకి అలవాటై పోయిందని ఆరోపించారు. ఆ రాజకీయాలకు కాలం చెల్లింది అని అచ్చెన్నాయుడు అన్నారు.
అమరావతి రైతుల నిరసనలను అణచి వేసేందుకు వైసీపీ పాలనలో ఎలాంటి దౌర్జన్యాలు జరిగాయో రాష్ట్ర ప్రజలకు ఇంకా గుర్తున్నాయని, ఇప్పుడు అదే రైతుల పేరుతో రాజకీయ పర్యటనలు చేయడం పూర్తిగా అవకాశవాద రాజకీయమని విమర్శించారు. గొడ్డలి పార్టీ నాయకుల పర్యటన సందర్భంగా శాంతి భద్రతలను కాపాడేందుకు విధుల్లో ఉన్న పోలీసులపైనే దాడి చేయడం అత్యంత బాధ్యతారాహిత్యమని మంత్రి మండిపడ్డారు. ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడటం అత్యంత విచారకరమని, ప్రజాస్వామ్యంలో పోలీసులపై దాడులకు ఎలాంటి సమర్థన ఉండదని స్పష్టం చేశారు. ప్రజలను రెచ్చగొట్టడం… ఉద్రిక్తతలు సృష్టించడం… తర్వాత నాటకాలు ఆడటం గొడ్డలి పార్టీ రాజకీయాలుగా మారాయని అన్నారు. అలాంటి చౌకబారు రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇక ఏమాత్రం నమ్మరని అన్నారు.
