అమరావతి : ఏపీలో విజయవాడ ఎంపీ , మాజీ ఎంపీలైన అన్నదమ్ములు కేశినేని చిన్ని , కేశినేని నానిల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. మాటల యుద్దానికి మరోసారి తెర లేపారు. ఒకరిపై మరొకరు తీవ్ర ఆరోపణలు చేసుకుంటూ కేసుల దాకా వెళ్లింది. తాజాగా వైసీపీకి చెందిన మాజీ ఎంపీ కేశినేని నాని ప్రస్తుత టీడీపీ ఎంపీ కేశినేని చిన్నికి చెందిన బినామీ సంస్థల భూ అక్రమాలపై చర్యలు తీసుకోవాలంటూ ఆయన ఏకంగా తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డికి లేఖ రాశారు .ఎక్సెల్లా ప్రాపర్టీస్ ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపణలు చేశారు. శాంషీగూడలో 112.72 ఎకరాల ప్రభుత్వ భూమిపై భారీ కుంభకోణం జరుగుతోందని పేర్కొన్నారు.
ED ఫ్రీజ్‌లు, NCLT అంశాలను సుప్రీంకోర్టు ముందు దాచారని ఆరోపించారు. ప్రైవేట్ రాజీ పిటిషన్లతో కోర్టును తప్పుదోవ పట్టించారని విమర్శించారు. జిల్లా కలెక్టర్ అఫిడవిట్ ప్రకారం భూమి పూర్తిగా ప్రభుత్వ పోరంబోకు భూమేనని పేర్కొన్నారని తెలిపారు. నాగమ్మ ఆలయం సమీపంలో అక్రమ బారికేడ్లు, భూ ఆక్రమణ యత్నం జరుగుతోందని ఆరోపించారు మాజీ ఎంపీ కేశినేని నాని. సుప్రీంకోర్టులో రాష్ట్రం తరఫున ఇంటర్వెన్షన్ పిటిషన్ వేయాలని సీఎంను కోరారు. హైడ్రాకు ఆదేశాలు ఇచ్చి అక్రమ నిర్మాణాలు తొలగించాలని డిమాండ్ చేశారు. ఎక్సెల్లా ప్రాపర్టీస్ భాగస్వాములపై క్రిమినల్ ట్రెస్పాస్, చీటింగ్ కేసులు నమోదు చేయాలని కోరారు.
