హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో నకిలీ కాలేజీ అడ్మిషన్ల ప్రకటనలు పెద్ద ఎత్తున వస్తున్నాయని పేర్కొన్నారు. ఆయా ప్రకటనల పట్ల విద్యార్థులకు సీపీ జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు ముందు జాగ్రత్తగా. ప్రధానంగా ఉస్మానియా యూనివర్సిటీ పేరును దుర్వినియోగం చేస్తున్నట్లు ఫిర్యాదులు వచ్చాయని పేర్కొన్నారు. గుర్తింపు లేని విద్యా సంస్థలపై హైదరాబాద్ నగర పోలీసులు చర్యలు చేపట్టారు. కాలేజీల అనుబంధ గుర్తింపును సరి చూసుకోవాలని విద్యార్థులకు పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్ సూచించారు. ఉస్మానియా యూనివర్సిటీతో అనుబంధం ఉన్నట్లు తప్పుడు ప్రకటనలు చేసే కాలేజీల పట్ల మోసపోవద్దని విద్యార్థులు, తల్లిదండ్రులను హైదరాబాద్ పోలీసులు హెచ్చరించారు.
నగరంలోని అనేక విద్యా సంస్థలు తమకు గుర్తింపు ఉందని తప్పుడు వాదనలతో అనధికారిక డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ప్రచారం చేస్తున్నాయని సిటీ పోలీస్ కమిషనర్ తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ అధికారుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ జరపగా, ఆయా కాలేజీలకు అధికారిక అనుమతి లేదా యూనివర్సిటీ అనుబంధ గుర్తింపు లేదని తేలిందన్నారు. నిబంధనలను ఉల్లంఘించినందుకు, విద్యార్థులను తప్పుదోవ పట్టించినందుకు గాను అటువంటి సంస్థలపై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. గుర్తింపు పొందిన కాలేజీల వివరాలు ఉండే ప్రభుత్వ అధికారిక ‘డిగ్రీ ఆన్‌లైన్ సర్వీసెస్ తెలంగాణ’ (DOST) ప్లాట్‌ఫారమ్ ద్వారా మాత్రమే అడ్మిషన్లు పొందాలని అధికారులు విద్యార్థులకు సూచించారు. విద్యా పరమైన , ఆర్థిక నష్టాన్ని నివారించడానికి, అనుమానాస్పద విద్యాసంస్థల గురించి పోలీసులకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు.
