ముంబై : కాక్రోచ్ జనతా పార్టీ అధ్యక్షుడు అభిజిత్ దిప్కే సంచలన ప్రకటన చేశారు. అక్టోబర్ 2వ తేదీన దేశ వ్యాప్తంగా జైల్ భరో ఆందోళన చేపడతామని వెల్లడించారు. ఎన్నికల సంఘం వ్యవహారశైలి దేశ ప్రయోజనాలకు అనుగుణంగా లేదని, వారి ‘నిరంకుశ ధోరణి’ ఆందోళనకరమని ఆయన ఆరోపించారు. దేశంలో మార్పు తీసుకు రావడానికి సమిష్టి కృషి అవసరమని పేర్కొన్నారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ వ్యవస్థాపకుడు అభిజీత్ దిక్కే బుధవారం నాడు ముంబైలోని శివాజీ పార్క్ నుండి గాంధీ జయంతి రోజున ‘జైల్ భరో ఆందోళన్’ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ముంబైకి చేరుకున్న దిప్కే ఆరోజు శివాజీ పార్క్ నుండి ఈ నిరసన ఉద్యమం మొదలవుతుందని తెలిపారు . ఈ ఆందోళనలో పాల్గొనాలని అన్ని రాజకీయ పార్టీలకు పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన ఆందోళనలను పరిష్కరించడానికి అందరూ ఏకం కావాలని ఆయన కోరారు.
ఎన్నికలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దుర్వినియోగం జరుగుతోందన్న ఎన్‌సీపీ అధినేత శరద్ పవార్ వ్యాఖ్యలకు అభిజిత్ దిప్కే మద్దతు తెలిపారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియపై ప్రతిపక్షాల నిరసనలు తీవ్రమవుతున్న తరుణంలోనూ, అలాగే ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలన్న డిమాండ్ల మధ్య ఈ ప్రకటన వెలువడింది. అంతకు ముందు, మహారాష్ట్ర నవనిర్మాణ సేన అధినేత రాజ్ థాకరే , శివసేన యుబిటి సేన అధినేత ఉద్ధవ్ థాకరే సంయుక్త సమావేశం నిర్వహించారు. ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా అక్టోబర్ 4న బైకుల్లా నుండి బీఎంసీ ప్రధాన కార్యాలయం వరకు నిరసన ర్యాలీ నిర్వహిస్తామని వారు ప్రకటించారు.
