5 లక్షల మంది మహిళా పారిశ్రామికవేత్తలే లక్ష్యం

సాధికారిత చాటేలా ‘నేషనల్ సరస్ మేళా’ నిర్వహణ

అమరావతి : స్వయం సహాయక సంఘ సభ్యులు ఆర్ధికంగా బలోపేతం అయ్యేలా అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పని చేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. దీనికి సెర్ప్, మెప్మా అధికారులు మద్దతుగా నిలవాలని సూచించారు. అవసరమైతే కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని నిర్దేశించారు. సంపద సృష్టికి ఎక్కడ, ఎలాంటి అవకాశాలు ఉన్నా వినియోగించుకునేలా డ్వాక్రా మహిళల్ని తీర్చిదిద్దాలన్నారు. 5 లక్షల మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా చేయడం లక్ష్యం కావాలని, స్వయం ఉపాధి పొందాలనుకునే వారు ఫ్రాంచైజీలు ప్రారంభించినా ప్రోత్సహించాలని సీఎం స్పష్టం చేశారు. రాష్ట్రంలో కోటికి పైగా ఉన్న స్వయం సహాయక సంఘ సభ్యులు ఆర్ధికంగా బలపడితే… కోటి కుటుంబాలకు పైగా బలపడినట్టేనని సీఎం చెప్పారు. ఎంట్రప్రెన్యూర్లు ఆర్ధికంగా విజయవంతం అయినప్పుడే గుర్తింపు వస్తుందన్నారు.

లక్ష మంది మహిళలు ఒకొక్కరు ఏడాదికి రూ.5 లక్షల వ్యాపారం చేయగలిగితే రూ.5,000 కోట్ల ఆర్థిక సామర్థ్యం సాధించినట్టేని సీఎం అన్నారు. క్యాంపు కార్యాలయంలో సెర్ప్, మెప్మా అధికారులతో 5 లక్షల మంది ఎంట్రప్రెన్యూర్లను తీర్చిదిద్దడం, స్వయం ఏపీ అంశాలపై సీఎం సమీక్షించారు. దేశంలోనే స్వయం సహాయక సంఘాలు అంతటి విస్తృతమైన వ్యవస్థ మరొక్కటి లేదని సీఎం సమీక్షా సమావేశంలో ప్రస్తావించారు. డ్వాక్రా సంఘాలు తయారు చేసే ఉత్పత్తులు ప్రపంచ మార్కెట్ చేరుకోవాలని, అదే సమయంలో మరి కొంతమంది ఉపాధి కల్పించేలా ఎదగాలని సీఎం సూచించారు. డ్వాక్రా మహిళలు తయారు చేస్తున్న వేలాది ఉత్పత్తులకు ఒకే బ్రాండ్, నాణ్యత ప్రమాణాలు, ఆధునిక ప్యాకేజింగ్, ఈ-కామర్స్, సిగ్నేచర్ స్టోర్లు, మార్కెటింగ్ వ్యవస్థను అనుసంధానం చేస్తూ ‘స్వయం AP’ని తీర్చిదిద్దాలన్నారు.

తొలిసారి విజయవాడలో ఈనెల 15 నుంచి 31 వరకు నిర్వహించ తలపెట్టిన ‘నేషనల్ సరస్ మేళా 2026’ను విజయవంతం చేయాలని ఆదేశించారు సీఎం. మహిళా సాధికారత చాటేలా సరస్ మేళా నిర్వహించాలని అన్నారు. దీనికి దేశ వ్యాప్తంగా ఉన్న మహిళా ఎంట్రప్రెన్యూర్లను, మహిళా ఎంపీలను ఆహ్వానించాలని నిర్దేశించారు. మరోవైపు సరస్ మేళాకు దేశం నలుమూలల నుంచి వివిధ స్వయం సహాయక సంఘాలు 600 స్టాళ్లు ఏర్పాటు చేస్తున్నాయని అధికారులు వివరించారు. మేళాకు రోజూ లక్ష మంది వస్తారని అంచనా వేస్తున్నామన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అధికారికంగా 15న ప్రారంభిస్తున్నారని తెలిపారు.

Leave A Reply

Your Email Id will not be published!