తిరుమల : తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి ( టీటీడీ) సంచలన ప్రకటన చేసింది. రోజు రోజుకు పుణ్య క్షేత్రమైన తిరుమలకు భక్తుల తాకిడి పెరుగుతోంది. వేలాది మంది స్వామి వారిని దర్శించుకునేందుకు తరలి వస్తున్నారు. ఇదిలా ఉండగా పెరటాసి మాసం, అలాగే రాబోయే వరుస సెలవుల నేపథ్యంలో భక్తుల రద్దీ మరింత పెరిగే అవకాశం ఉన్నందున టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.అక్టోబర్ 1వ తేదీ గురువారం, అక్టోబర్ 5వ తేదీ సోమవారం ప్రోటోకాల్ ప్రముఖులకు మినహా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేయడం జరిగిందని తెలిపింది. ఈ విషయాన్ని భక్తులు గమనించి , టీటీడీకి సహకరించాలని కోరింది.
ప్రస్తుతం రోజుకు సుమారు 80 వేలమంది భక్తులకు స్వామివారి దర్శనం చేయించడం జరుగుతోందని తెలిపింది. అయినప్పటికీ అదే రోజు అదనంగా వచ్చి దర్శనానికి నిరీక్షించే దాదాపు 30 వేల మంది భక్తులు తర్వాత రోజు స్వామి వారిని దర్శించుకునే పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో సామాన్య భక్తులు స్వామివారి దర్శనం కోసం వేచి ఉండే సమయం మరింత పెరుగుతోంది. ఈ కారణంగా అధిక సంఖ్యలో సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది టీటీడీ.
బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన తేదీలకు సంబంధించి ముందు రోజు అనగా సెప్టెంబర్ 30వ తేది బుధవారం, అక్టోబర్ 4వ తేది ఆదివారం సిఫార్సు లేఖలు స్వీకరించడం జరగదని పేర్కొంది. అధిక రద్దీని దృష్టిలో ఉంచుకుని టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయాన్ని గమనించి సహకరించాల్సిందిగా భక్తులకు టీటీడీ విజ్ఞప్తి చేసింది.
