విశాఖపట్నం : ఏపీ సర్కార్ ప్రముఖ వాహనాల తయారీ సంస్థ కియా కంపెనీతో ఒప్పందం చేసుకుంది. ఈ సందర్బంగా విశాఖపట్నం కేంద్రంగా జరుగుతున్న సీఐఐ సదస్సు 2026లో సీఎం నారా చంద్రబాబు నాయుడు, కియా చైర్మన్, ఎండీలతో భేటీ అయ్యారు. దూరదృష్టితో కూడిన భాగస్వామ్యాలు ప్రాంతాలను ఎలా మార్చగలవో ఆంధ్రప్రదేశ్ నిరంతరం నిరూపిస్తూనే ఉందన్నారు ఈ సందర్బంగా సీఎం. అనంతపురంలో కియా ప్రస్థానం ఇందుకు ఒక నిదర్శనం అని చెప్పారు. 2014–19 మధ్య మా హయాంలో, మేము కియాను అనంతపురానికి తీసుకువచ్చి, కరువు పీడిత జిల్లాను ఒక ప్రధాన ఆటోమోటివ్ తయారీ కేంద్రంగా మార్చామన్నారు. ఇక్కడ తయారైన కియా వాహనాలు 100 దేశాలకు చేరుతున్నాయని చెప్పారు. తద్వారా వేలాది ఉద్యోగాలను సృష్టిస్తూ ప్రపంచ వ్యాప్తంగా భారతదేశ ఆటోమోటివ్ ఉనికిని బలోపేతం చేస్తున్నాయని ప్రశంసించారు.
ఈ విజయవంతమైన భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకువెళ్తూ తాము 2 బిలియన్ డాలర్ల పెట్టుబడితో అనంతపురంలో రెండవ తయారీ కేంద్రం కోసం కియాతో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చు కోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ కేంద్రం ద్వారా సంవత్సరానికి 2 లక్షల వాహనాల ఉత్పత్తి సామర్థ్యం పెరుగుతుందని తెలిపారు. సుమారు 12,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు లభిస్తాయని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. దీంతో రెండు ప్లాంట్‌లలో కలిపి కియా ఇండియా వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 6 లక్షల వాహనాలకు పైగా చేరుకుంటుందన్నారు. దీనికి అయ్యే మొత్తం పెట్టుబడులు 5 బిలియన్ డాలర్లకు చేరుతాయని తెలిపారు. కియా ఇండియా ఎండీ గ్యాంగు లీ, కియా కార్పొరేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ యూయ్ చుల్ జియోంగ్ ఈవీ తయారీ, ఆటోమోటివ్ ఆవిష్కరణ , స్థానిక సరఫరాదారుల వ్యవస్థను బలోపేతం చేయడం వంటి అంశాలతో సహా ఏపీలో కంపెనీ దీర్ఘకాలిక ప్రణాళికలపై కూడా చర్చలు జరిపారు సీఎం .