హైదరాబాద్ : రైతుల సంక్షేమాన్ని పక్కనపెట్టి కేవలం రాజకీయ ప్రయోజనాల కోసమే రేవంత్ రెడ్డి పని చేస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి కేటీఆర్. ప్రజా సమస్యలను గాలికి వదిలి వేశారని, రాష్ట్రంలో పాలన గాడి తప్పిందన్నారు. సీఎంకు తనను, తమ కుటుంబాన్ని ఆడి పోసుకోవడమే తప్పా ఏపనీ చేయడం లేదన్నారు. కరువు వల్ల ఉపాధి కోల్పోయిన ప్రతి వ్యవసాయ కూలీక 36 నెలల పాటు నెలకు రూ. 1,000 చొప్పున, మొత్తం రూ. 36,000 ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఓట్లు కావాలి, సీట్లు కావాలి.. మరి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు నిధులు ఇచ్చేందుకు సిద్ధంగా ఉందా? ప్రధాని మోదీ మనసులో తెలంగాణకు ఏమైనా స్థానం ఉందా? అని ప్రశ్నించారు. బీజేపీ నాయకులకు నిజంగా ధైర్యం ఉంటే, ప్రధాని మోదీ ఇంటి ముందు ధర్నా చేయాలని సవాల్ విసిరారు కేటీఆర్.
రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ను ఓడించి, అభివృద్ధి, సంక్షేమ నాయకుడైన కేసీఆర్ను తిరిగి అధికారంలోకి తీసుకు రావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో నెలకొన్న కరువును గుర్తించడంలో రేవంత్ రెడ్డి విఫలమయ్యారని ఆయన విమర్శించారు. రైతులు కష్టాల్లో ఉంటే, గ్రామాల్లో నాటకాలు ప్రదర్శించాలని ముఖ్యమంత్రి సూచించడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల ప్రాణాల కంటే రాజకీయ ప్రయోజనాలే రేవంత్ రెడ్డికి ముఖ్యమా? రైతులకు కనీస భరోసా ఇవ్వలేని ఆయనకు, కేటీఆర్ మీసం గురించి ఎందుకు అంత చింత? రేవంత్ రెడ్డికి ఎవరైనా గట్టిగా బుద్ధి చెప్పాలా? తను ఎదుర్కొంటున్న విమర్శలను, దూషణలను మరెవరైనా భరించాల్సి వస్తే, వారు నీళ్ల బకెట్లో దూకి ప్రాణాలు తీసుకునే వారేమో. తెలుగు భాషలో ఉన్న అన్ని రకాల తిట్లు రేవంత్ రెడ్డిపై కురిపిస్తున్నారని పేర్కొన్నారు.
