చెన్నై : దిగ్గజ దర్శకుడు మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇంజి వెల్లం. ఇందులో విజయ్ సేతుపతి, సాయి పల్లవి కలిసి నటిస్తున్నారు తొలిసారిగా. దీంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. మణిరత్నం రూపొందిస్తున్న తాజా రొమాంటిక్ డ్రామా ‘ఇంజి వెల్లం’లో విజయ్ సేతుపతి, సాయి పల్లవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం ప్రకటించినప్పటి నుంచే ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పింది. తాజాగా చిత్ర బృందం సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించింది. ఈ చిత్రం 2027 జనవరి 29న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. మణిరత్నానికి చెందిన నిర్మాణ సంస్థ ‘మద్రాస్ టాకీస్’ తమ సోషల్ మీడియా వేదికల ద్వారా ఈ విడుదల తేదీని వెల్లడించింది. దీనితో పాటు విజయ్ సేతుపతి, సాయి పల్లవి ,ఇద్దరు పిల్లలు ఉన్న కొత్త పోస్టర్ను కూడా విడుదల చేశారు. ఇది సినిమా కథాంశం, పాత్రల గురించి ప్రేక్షకుల్లో మరింత కుతూహలాన్ని రేకెత్తించింది.
ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ , ఫస్ట్-లుక్ మోషన్ పోస్టర్ను సెప్టెంబర్ 7న విడుదల చేశారు. ఆ పోస్టర్లో విజయ్ సేతుపతి, సాయి పల్లవి వర్షంలో రొమాంటిక్గా కనిపిస్తుండటంతో ఇది ఒక ప్రేమకథ అని స్పష్టమవుతోంది. కథాంశం , పాత్రల వివరాలను చిత్ర బృందం ఇంకా గోప్యంగా ఉంచినప్పటికీ ఈ దృశ్యాలు అభిమానుల్లో మంచి ఉత్సాహాన్ని నింపాయి. సినిమా పూర్తి కథాంశం ఇంకా తెలియ రాలేదు కానీ కోల్కతా ఈ చిత్రానికి ప్రధాన షూటింగ్ లొకేషన్లలో ఒకటిగా ఉన్నట్లు సమాచారం. విజయ్ సేతుపతి, సాయి పల్లవి కలిసి నటిస్తున్న మొదటి చిత్రం ఇదే కావడం విశేషం. వీరిద్దరి కలయిక ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మణిరత్నం దర్శకత్వం వహిస్తుండటం , ఏ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండటంతో 2027 జనవరిలో విడుదల కానున్న తమిళ చిత్రాల్లో ‘ఇంజి వెల్లం’ ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తోంది.
‘థగ్ లైఫ్’ తర్వాత మణిరత్నం తెరకెక్కిస్తున్న తదుపరి చిత్రం ఇది. ఆయన మళ్లీ రొమాంటిక్ డ్రామా జానర్లోకి తిరిగి వస్తుండటంతో,ఈ ప్రాజెక్ట్ పట్ల అంచనాలు, కుతూహలం పెరిగాయి. అలాగే, 2018లో వచ్చిన ‘చెక్క చివంత వానమ్’ తర్వాత విజయ్ సేతుపతి, మణిరత్నం మరోసారి కలిసి పని చేస్తున్నారు.
సుభాస్కరన్ సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ , మద్రాస్ టాకీస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.