హైదరాబాద్ : టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ఇడుపు కాయితం. బన్నీ వాస్ వర్క్స్ , సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై నిర్మితమవుతున్న ఈ చిత్రం ఒక ఆసక్తికరమైన బృందంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. సహాయ నటుడిగా కెరీర్‌ను ప్రారంభించి క్రమంగా మంచి కథా నాయకుడిగా ఎదిగిన ప్రియదర్శి విమర్శకుల ప్రశంసలు పొందిన ‘బలగం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యారు. అప్పటి నుండి వైవిధ్య భరితమైన కథలను ఎంచుకుంటూ తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు. వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇడుపు కాయితం చిత్రం ఇప్పటికే ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించింది.
తాజాగా విడుదలైన ఈ చిత్ర టీజర్ గ్రామీణ నేపథ్యంలో సాగే వినోదాత్మక కథాంశాన్ని పరిచయం చేసింది. టీజర్‌లో రంగుల మయమైన వివాహ వేడుకలు, కుటుంబ సభ్యుల మధ్య సంభాషణలు కనిపిస్తున్నాయి. ఇందులో నాగ దుర్గ , ప్రియదర్శి.. శ్రీలత, శ్రీనివాస్ పాత్రల్లో మెరిశారు. హాస్యంతో పాటు భావోద్వేగపూరిత సన్నివేశాలు, కథలో ఊహించని మలుపులు ఉంటాయని టీజర్ సూచిస్తోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం కుటుంబ డ్రామా, హాస్యం , సహజమైన బంధాల కలయికగా కనిపిస్తోంది. ప్రియదర్శి నటనతో పాటు ఆకట్టుకునే సంభాషణలు , పాత్రల మధ్య ఉండే అనుబంధాలు టీజర్‌లో ప్రత్యేకంగా నిలిచి, ప్రేక్షకుల్లో అంచనాలను పెంచాయి. తెలంగాణ జానపద పాటల ద్వారా ప్రాచుర్యం పొందిన నాగ దుర్గ ఈ చిత్రం ద్వారా టాలీవుడ్‌లో కథానాయికగా పరిచయమవుతున్నారు.