ఏపీలో కూట‌మి స‌ర్కార్ పాల‌న బ‌క్వాస్ : వైఎస్ ష‌ర్మిల

ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుపై తీవ్ర ఆగ్ర‌హం

విజయవాడ : ఏపీపీసీసీ రాష్ట్ర అధ్య‌క్షురాలు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. కూట‌మి స‌ర్కార్ ను ఏకి పారేశారు. శుక్ర‌వారం విజ‌య‌వాడ‌లో ఆమె మీడియాతో మాట్లాడారు. పాల‌నా ప‌రంగా సీఎం చంద్ర‌బాబు నాయుడు పూర్తిగా ఫెయిల్ అయ్యార‌ని ఆరోపించారు. కేవ‌లం ప్ర‌చారానికే ప‌రిమితం అయ్యారే త‌ప్పా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌ట్టించుకున్న పాపాన పోలేద‌న్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్ అంటే నాడు దివంగ‌త సీఎం వైఎస్ఆర్ హయాంలో పేదవాడి చదువుకు పండుగ లాగా ఉండేద‌న్నారు. కానీ ఇవాళ చంద్రబాబు పాలనలో వేల కోట్ల బకాయిలతో చదువంటేనే దండుగ లాగా మారిందంటూ తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు ష‌ర్మిలా రెడ్డి. ఓవైపు లక్షల కోట్ల పెట్టుబడులంటూ భారీ ప్రచారాలు మరోవైపు వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు, విద్యార్థుల ఆత్మహత్యా యత్నాలు కొన‌సాగుతూనే ఉన్నాయ‌న్నారు .

పెట్టుబడులకు స్వర్గధామమని చెప్పుకునే రాష్ట్రంలో. కనీసం పేద విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించడానికి దిక్కు లేకుండా పోయింద‌న్నారు. దీనికి ప్ర‌ధాన కార‌ణం కూట‌మి స‌ర్కారేన‌ని ఆరోపించారు ష‌ర్మిలా రెడ్డి. విద్యార్థుల ప్రాణాలతో, జీవితాలతో చెలగాటం ఆడుతున్నందుకు కూటమి ప్రభుత్వం సిగ్గుపడాలి అని అన్నారు. గత 3 ఏళ్లుగా రూ.6 వేల కోట్లకు పైగా బకాయిలు పెట్టడమంటే, బిడ్డల చదువులపై చంద్రబాబుకున్న చిత్తశుద్ధి ఏమిటో స్పష్టమైందన్నారు. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలన్నీ క్లియర్ చేస్తామన్న హామీ ఏమైంది? అని ప్ర‌శ్నించారు పీసీసీ చీఫ్‌. నేరుగా కాలేజీల అకౌంట్ లోకే నిధులు జమ అంటూ ఇచ్చిన వాగ్ధానం కార్యాచరణ ఏది ? అని నిల‌దీశారు. రాష్ట్రంలో ఎక్కడ చూసినా విద్యార్థుల అరణ్య రోదన వినిపిస్తోంద‌న్నారు. కాలేజీల చుట్టూ సర్టిఫికెట్ల కోసం కాళ్లరిగేలా తిరగాల్సిన దుస్థితి ఏర్ప‌డింద‌న్నారు. సర్టిఫికెట్లు అందక పేద విద్యార్థుల భవిష్యత్తు అంతా అగమ్య గోచరంగా మారింద‌న్నారు.

Leave A Reply

Your Email Id will not be published!