ఏనుగుల సంచారం పట్ల అప్రమత్తంగా వ్యవహరించాలి

అడవిలోకి మళ్లించేందుకు ఏర్పాట్లు చేయాల‌ని ఆదేశం

అమ‌రావ‌తి : ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. చిత్తూరు జిల్లా లోని పడిపుట్లబైలు సమీపంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపును అడవిలోకి మళ్లించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అట‌వీ శాఖ అధికారులను ఆదేశించారు. ముసలమడుగు శిబిరం నుంచి కుంకీ ఏనుగులను తీసుకువచ్చి ఆపరేషన్ చేపట్టాలని సూచించారు. హనుమాన్ బృందాలు, పోలీసు, రెవెన్యూ, విద్యుత్ శాఖల సమన్వయంతో ఏనుగుల కదలికలపై నిరంతర నిఘా ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సోమవారం పడిపుట్లబైలు ఏనుగుల సంచారంపై అటవీ శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి సమీక్షించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పరిసర గ్రామాల్లో మానవ–ఏనుగు ఘర్షణలు తలెత్తకుండా అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు . గత 15 రోజులుగా 11 ఏనుగులతో కూడిన గుంపు, గుంపు నుంచి విడిపోయిన మరో రెండు ఏనుగులు పడిపుట్లబైలు పంచాయతీ పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ పుండ్లవల్లపల్లి, నడింపల్లి, కొండకిందపల్లి గ్రామాల్లో వ్యవసాయ పంటలకు నష్టం కలిగిస్తున్నట్టు రైతులు ఆవేదనలో ఉన్నారని గుర్తు చేశారు.

ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం మేరకు ఒక ఏనుగుల గుంపు రహదారిని దాటి మంగళంపేట బీట్‌లోకి ప్రవేశించగా, మరో రెండు ఏనుగులు కూడా రహదారి దాటి చిత్తూరు వైపు కదులుతున్నట్టు వివరించారు డిప్యూటీ సీఎంకు. ఈ ఏనుగుల సంచారం పాకాల, పులిచెర్ల, చంద్రగిరి మండలాల ప్రజలకు ముప్పుగా మారే అవకాశం ఉందని తెలిపారు. ఈ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాల‌ని పేర్కొన్నారు. ఎప్పటికప్పుడు ఏనుగుల కదలికలను పోలీసు, రెవెన్యూ, విద్యుత్, తత్సంబంధిత తదితర శాఖలు, హనుమాన్ బృందాలతో సమన్వయం చేసుకుంటూ నిరంతరం పర్యవేక్షించాలని స్ప‌ష్టం చేశారు. అలాగే, క్షేత్రస్థాయి బృందాలు నిరంతర నిఘా కొనసాగిస్తూ, ప్రమాదానికి అవకాశం ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు ప‌వ‌న్ క‌ళ్యాణ్‌. సాధ్యమైన చోట ఏనుగుల కారణంగా ప్రజలకు ఎలాంటి హాని కలగకుండా చూసుకోవాలని అన్నారు.

Leave A Reply

Your Email Id will not be published!