తిరుపతి / నందలూరు : కడప జిల్లా నందలూరులో వెలసిన ప్రాచీన, ప్రసిద్ధ శ్రీ సౌమ్యనాథ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల గోడ పత్రికలను టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర ఆవిష్కరించారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశం మందిరంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, జూలై 21 నుండి 31 వరకు బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 21వ తేదీన అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయన్నారు. జూలై 22న ధ్వజారోహణం, జూలై 26న గరుడసేవ, జూలై 28న ఉదయం కల్యాణోత్సవం, జూలై 29న రథోత్సవం, జూలై 30న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయన్నారు. భక్తులను ఆకట్టుకునేలా విద్యుత్ దీపాలంకరణలు, పుష్పాలంకరణలు, క్యూలైన్లు, ఫ్లెక్సీలు, ఆర్చీలు ఏర్పాటు చేయాలన్నారు. ప్రతిరోజు వాహన సేవల సందర్భంగా భజనలు, కోలాటాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టాలన్నారు. అదనంగా మొబైల్ మరుగుదొడ్లు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రథమ చికిత్స కేంద్రాలు, అంబులెన్సులు, అగ్నిమాపక సిబ్బంది, వాహన పార్కింగ్ సదుపాయాలు ఏర్పాటు చేపట్టాలని సూచించారు.
భక్తులు పెద్ద సంఖ్యలో బ్రహ్మోత్సవాల్లో పాల్గొని స్వామివారి కటాక్షానికి పాత్రులు కావాలని ఈవో కోరారు. ఉత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు స్వామివారు వివిధ దివ్య వాహనాలపై మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉత్సవాలకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. 22న ధ్వజారోహణం, యాలి వాహనం, 23న ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంస వాహనం, 24న ఉదయం పల్లకీ సేవ, రాత్రి సింహ వాహనం, 25న ఉదయం కల్పవృక్ష వాహనం, రాత్రి హనుమంత వాహనం, 26న ఉదయం శేష వాహనం, రాత్రి గరుడ వాహనం, 27న ఉదయం సూర్యప్రభ వాహనం, రాత్రి చంద్రప్రభ వాహనం, 28న ఉదయం 10 గంటలకు ఆర్జిత కల్యాణోత్సవం, రాత్రి గజ వాహనం, 29న ఉదయం 9 గంటలకు రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 30న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం, 31న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం ఉంటుందన్నారు ఈవో.